సులభతర వాణిజ్యంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలి: సీఎస్ ఆదిత్యనాథ్

16 Aug, 2021 20:20 IST|Sakshi

వివిధ శాఖల కార్యదర్శుల సమావేశంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌

సాక్షి, అమరావతి: సులభతర వాణిజ్యం (ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ అదే స్థాయిలో కొనసాగించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సులభతర వాణిజ్యం, మినిమైజేషన్‌ ఆఫ్‌ రెగ్యులేటరీ కాంప్లయన్స్‌ బర్డెన్‌ (ఎంఆర్‌సీబీ) అంశాలపై వివిధ శాఖల కార్యదర్శులతో సీఎస్‌ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ను వాస్తవికంగా ఆచరణలో పెట్టే ప్రక్రియలో భాగంగా రాబోయే తరాలకు తగ్గట్టుగా సేవలందించే విషయంలో తలెత్తే సమస్యల్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందులో భాగంగా వివిధ సేవల్ని ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నిర్ధిష్ట కాలవ్యవధిలో అందేలా చర్యలు తీసుకోనుందన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల వారీగా అందించే వ్యాపార, వాణిజ్య సేవలను వినియోగదారులకు సకాలంలో ఒక నిరి్ధష్ట సమయం ప్రకారం అందే విధమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు చెప్పారు.

ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని, శాఖల వారీగా ఏయే కార్యక్రమాలు చేపడుతున్నామనే విషయాలు వినియోగదారులకు పూర్తిగా తెలియాల్సి ఉందన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్లు నోడల్‌ అధికారుల వివరాలను అందుబాటులో ఉంచుకుని ఎప్పటికప్పుడు సంబంధిత అసోసియేషన్లతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేయాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్లు  కనీసం 1 శాతం వినియోగదారులతో స్వయంగా మాట్లాడి వారు అడిగే  సమస్యలు, సందేహాలను నివృత్తి చేయాలన్నారు. సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు కలెక్టర్లతో మాట్లాడి క్షేత్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు దశల్లో 390 సమస్యలను గుర్తించి వాటిని 285కు తగ్గించామని తెలిపారు. పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం అజెండా అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.
 

చదవండి: ‘‘జై జగన్‌ మామయ్య.. జై జై జగన్‌ మామయ్య’’


 

మరిన్ని వార్తలు