ఇద్దరు ఐఏఎస్‌లపై చర్యలొద్దు: సీఎస్‌

29 Jan, 2021 08:21 IST|Sakshi

 నిబంధనలకు విరుద్ధంగా ఎస్‌ఈసీ వ్యవహరించారు..

అందుకే ఆ ఉత్తర్వులను తిరస్కరించాం

తన పరిధి దాటి వ్యవహరించొద్దని ఎస్‌ఈసీకి సూచించండి

కేంద్రానికి సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. నిబంధనలను ఏమాత్రం పాటించకుండా ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను ఎస్‌ఈసీ సెన్సూర్‌ చేశారని తెలిపింది. అఖిల భారత సర్వీసు అధికారులను సెన్సూర్‌ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని,  సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇదే అంశాన్ని స్పష్టం చేసిందని పేర్కొంది. ఈ క్రమంలో ఏకపక్షంగా ఇద్దరు ఐఏఎస్‌లను సెన్సూర్‌ చేస్తూ ఎస్‌ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను తిరస్కరించామని వివరించింది. చదవండి: ఆ అధికారం నిమ్మగడ్డకు ఉందా..?

డీవోపీటీకి ఎస్‌ఈసీ చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని, ఆ ఇద్దరు ఐఏఎస్‌లపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తన పరిధి దాటి వ్యవహరించవద్దని ఎస్‌ఈసీకి సూచించాలని కోరింది. ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ గురువారం కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. దీన్ని కేంద్ర హోం శాఖ కార్యదర్శి, డీవోపీటీ కార్యదర్శిని సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ ఢిల్లీలో స్వయంగా కలిసి అందించారు. ఆ లేఖలో ప్రధాన అంశాలివీ.. చదవండి: టీడీపీ కుట్రకు యాప్‌ దన్ను

అది చట్ట విరుద్ధం..
‘పంచాయతీ ఎన్నికలకు జనవరి 2021 నాటికి అర్హత ఉన్న వారందరి పేర్లతో ఓటర్ల జాబితాను సిద్ధం చేయలేదనే ఆరోపణలతో ఈనెల 26న పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్‌ గిరిజా శంకర్‌ను సెన్సూర్‌ చేస్తూ ఎస్‌ఈసీ ఉత్తర్వులిచ్చారు. ఇదే అంశంపై డీవోపీటీ కార్యదర్శికి ఆయన ఫిర్యాదు చేశారు. ఎస్‌ఈసీ తన పరిధిని దాటి ఇద్దరు ఐఏఎస్‌లను బలవంతపు పదవీ విరమణ చేయాలని సూచించడాన్ని  ఆక్షేపిస్తున్నాం. ఎన్నికల నిర్వహణలో నిబంధనలను అతిక్రమించిన అధికారులను సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఎస్‌ఈసీకి ఉంది.

ఓటర్ల జాబితా సవరణలో లోటు పాట్లుంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసే వెసులుబాటు మాత్రమే ఎస్‌ఈసీకి ఉంటుంది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు 2000లో ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. అఖిల భారత సర్వీసు అధికారుల(డి అండ్‌ ఏ) రూల్స్‌–1969 ప్రకారం సెన్సూర్‌ చేయడమంటే చిన్న చిన్న పెనాల్టీలు విధించవచ్చు. ఆ అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కానీ ఎస్‌ఈసీ తన పరిధి దాటి రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లోకి చొరబడి ఇద్దరు ఐఏఎస్‌ అధికారుల సర్వీసు రికార్డుల్లోకి సెన్సూర్‌ ఉత్తర్వులను చేర్చడం చట్ట విరుద్ధం. అందువల్ల సెన్సూర్‌ చేస్తూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఎస్‌ఈసీ డీవోపీటికి ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. ఈ ఇద్దరు ఐఏఎస్‌ల గత సర్వీసు రికార్డును పరిశీలిస్తే ఎలాంటి తప్పిదాల్లేవు. సెన్సూర్‌ ఉత్తర్వులను తోసి పుచ్చండి. తన పరిధిలో లేని అధికారాలను నిర్వహించకుండా ఎస్‌ఈసీకి సూచిస్తూ ఆదేశాలివ్వండి’ అని కోరారు.  

>
మరిన్ని వార్తలు