కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవు: సీఎస్‌ సమీర్‌ శర్మ

19 Jan, 2022 15:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ సమీర్‌ శర్మ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్‌వేవ్‌ వల్ల మరింత నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏపీలోనే ఉద్యోగుల జీతాల బడ్జెట్‌ ఎక్కువగా ఉందని.. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు బ్యాలెన్స్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కరోనా కష్ట​కాలంలో కూడా ఉద్యోగులకు ఐఆర్‌ ఇచ్చామని వివరించారు.

కరోనా లేకపోతే రాష్ట్ర రెవెన్యూ రూ.98 వేల కోట్లు ఉండేదని సమీర్‌ శర్మ చెప్పారు. పీఆర్సీ ఆలస్యం అవుతుందనే ఐఆర్‌ ఇచ్చామన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర రెవెన్యూ రూ.62 వేల కోట్లే ఉందని.. కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆదాయం పడిపోయిందన్నారు. కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవని స్పష్టం చేశారు. ఉద్యోగులందరినీ ప్రభుత్వం సమానంగానే చూస్తుందని.. ఐఏఎస్‌లకు ఎక్కువ జీతాలు వస్తున్నాయనడం అవాస్తవమని తెలిపారు. 

ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రావత్‌ మాట్లాడుతూ.. 27 శాతం ఐఆర్‌ గతంలో ఎవరూ ఇవ్వలేదేని తెలిపారు. అందరికీ న్యాయం చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రయత్నించారని పేర్కొన్నారు. విభజన కారణంగా ఏపీ ఆర్థికంగా దిగజారిపోయిందని.. సేవా రంగం నుంచి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిపోయిందని తెలిపారు. ఏపీలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉందని.. వ్యవసాయం నుంచి పన్నుల ఆదాయం ఉండదని తెలిపారు.

విభజనే వల్ల హైదరాబాద్‌ను కోల్పోయామని దాంతో పాటే పన్నుల ఆదాయం కూడా నష్టపోయామని పేర్కొన్నారు. ఏపీకి జనాభా ఎక్కువ.. పన్నుల ఆదాయం తక్కువ అన్నారు. ఇంకా రూ. 33,490 కోట్ల అప్పుల విభజన జరగాల్సి ఉందని.. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా తగ్గిపోయిందని వెల్లడించారు. ఐఆర్‌ రూపంలో రూ. 17,918 కోట్లు ఇచ్చామని వివరించారు. అంగన్‌వాడీ, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో పాటు ఆశా వర్కర్లకు కూడా గౌరవ వేతనాలు పెంచామని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా వేతనాలు పెంచామని చెప్పారు. కాంట్రాక్ట్‌ వర్కర్లకు మినిమం టైమ్‌ స్కేల్‌ అమలు చేస్తున్నామని రావత్‌ తెలిపారు. 

చదవండి: రూ.కోటి విరాళం.. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కోసం.. 

మరిన్ని వార్తలు