భావోద్వేగాలను రెచ్చగొట్టడం తగదు 

28 Jun, 2021 05:55 IST|Sakshi

తెలంగాణ మంత్రులకు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా హితవు 

రాజంపేట టౌన్‌: ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం తగదని తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా హితవు పలికారు. వైఎస్సార్‌ జిల్లా రాజంపేటలోని ఆకేపాటి భవన్‌లో ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్‌ సురేష్‌బాబు, వైఎస్సార్‌ సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిలతో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

శ్రీశైలం ప్రాజెక్ట్‌ నుంచి కాని నాగార్జునసాగర్‌ నుంచి కాని తమకు కేటాయించిన నీటికంటే ఒక బొట్టు కూడా అదనంగా తాము వాడుకోవడం లేదని స్పష్టం చేశారు. దొంగతనంగానో, తప్పుడు మార్గంలోనో నీళ్లు తీసుకునే తక్కువ స్థాయి ఆలోచనలు తమ ప్రభుత్వానికి లేవన్నారు. నీటి వినియోగంపై తెలంగాణ మంత్రులకు సందేహాలుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా నివృత్తి చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తమ ప్రభుత్వం ఎన్‌జీటీ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించడం లేదన్నారు.  

మరిన్ని వార్తలు