భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉంటా..

14 Apr, 2022 17:58 IST|Sakshi

డిప్యూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

తాడేపల్లిగూడెంలో ఘన స్వాగతం

తాడేపల్లిగూడెం: భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉంటా.. పదవికి వన్నె తెస్తానని డిప్యూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా బుధవారం ఆయన పట్టణానికి వచ్చారు. నియోజకవర్గంలో అభిమానులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లిగూడెంలోని పోలీసు ఐలాండ్‌ సెంటర్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంపై అభిమానం, తనపై నమ్మకంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురుతర బాధ్యత అప్పగించారని, పారదర్శకంగా పనిచేసి పదవికి వన్నె తెస్తానన్నారు. ఆలయాల్లో రాజకీయాలు చేసే పార్టీలకు గుణపాఠం చెప్పడంతో పాటు ధర్మాన్ని కాపాడాలన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం ఆలయాల్లో రాజకీయాలు చేస్తున్నాయని ఇది దుర్మార్గం అని అన్నారు.  

హిందూ ధర్మంపై విశ్వాసం పెంచేలా.. 
ప్రతిఒక్కరిలో దైవభక్తి, హిందూధర్మంపై విశ్వాసం పెంచేలా కృషిచేస్తానని డిప్యూటీ సీఎం కొట్టు అన్నారు. దేవుడిని ప్రజలకు దగ్గర చేయాలనే ప్రభుత్వ ఉద్దేశా న్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తానన్నారు. దేవదాయ శాఖను అత్యంత విశ్వసనీయ శాఖగా మారుస్తానన్నారు. మంత్రివర్గంలో స్థానంతో పాటు తనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన గౌరవంగా భావించాలన్నారు.  

కాపులకు సముచిత స్థానం 
కాపు సామాజికవర్గానికి ముఖ్యమంత్రి సముచిత స్థానం ఇస్తున్నారని, దీనిని అందరూ గమనించాలని డిప్యూటీ సీఎం కొట్టు అన్నారు. కాపులకు గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల దుష్ప్రచారం, దుర్మార్గపు ఆలోచనలు ప్రజలు గుర్తించాలని కోరారు. పేదలకు న్యాయం చేస్తామని చెప్పిన కమ్యూనిస్టు పార్టీలు సైతం ప్రజాద్వేషానికి గురవుతున్నాయన్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో తాడేపల్లిగూడెం ప్రాంత అభివృద్ధికి కృషిచేశారని, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఇక్కడి వారిపై ప్రేమ చూపించడం ఆనందంగా ఉందన్నారు. 2024 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీని గెలిపించి ముఖ్యమంత్రికి కా నుకగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

అపూర్వ స్వాగతం
డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విజయవాడ నుంచి ఉంగుటూరు మండలం పట్టంపాడులోని ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేసిన అనంతరం ఊరేగింపుగా బయలుదేరారు. తాడేపల్లిగూడెం మండలం ముత్యాలంబపురంలోని ము త్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం భారీ ర్యాలీతో పట్టణ వీధుల్లో ఊరేగారు. కార్యకర్తలు, అభిమానులు క్రేన్‌ సాయంతో గజమాల వేసి అభిమానం చాటుకున్నారు.  

మరిన్ని వార్తలు