ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు

24 Jul, 2020 11:41 IST|Sakshi

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం ఘటన దర్యాప్తులో వేగం పెంచాలని జిల్లా ఎస్పీని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ కేసులో ప్రమేయం ఉన్న ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేరానికి పాల్పడినవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, తప్పుడు సమాచారాన్ని చేర వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. (శిరోముండనం కేసులో ఎస్‌ఐ అరెస్టు)

ఈ నెల 18 రాత్రి మునికూడలి గ్రామం వద్ద ఇసుక లారీ.. బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌ నడుపుతున్న వ్యక్తికి కాలు విరిగింది. దీంతో కొంతమంది ఎస్సీ యువకులు లారీని అడ్డుకుని వాగ్వివాదానికి దిగడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అదే సమయంలో కారులో అటుగా వచ్చిన మునికూడలి పంచాయతీ మాజీ సర్పంచ్‌ భర్త కవల కృష్ణమూర్తి ‘ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది.. లారీని వదిలేయండి’ అని చెప్పడంతో ఆ యువకులు ఆయనతో కూడా గొడవకు దిగి కారు అద్దాలను పగులగొట్టారు. అడ్డుకోబోయిన అడప పుష్కరం అనే అతడిని కొట్టారు. దీంతో గొడవ పడిన ఐదుగురు యువకులపై అడప పుష్కరం సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు సోమవారం ఇన్‌చార్జ్‌ ఎస్సై ఫిరోజ్‌ షా నిందితుల్లో ఒకరైన ఇండుగుమిల్లి ప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ట్రిమ్మర్‌ తెప్పించి అతడి గడ్డం, మీసాలు, తల వెంట్రుకలను తొలగించి విడిచిపెట్టారు. ఈ కేసులో ఇన్‌చార్జ్‌ ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

మరిన్ని వార్తలు