వారికి ఎ‍న్నడూ లేని విధంగా ప్రోత్సాహం

6 Dec, 2020 20:46 IST|Sakshi

సాక్షి, విజయవాడ : హోంగార్డుల సామాజిక, ఆర్ధిక స్థితి అనేక రెట్లు పెంచడంతో పాటు ఎన్నడూ లేని విధంగా వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ అన్నారు. వేతనాల పెంపు, ప్రమాద భీమా వర్తింపుతో హోంగార్డుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. రాష్ట్రానికి హోంగార్డులు అద్భుతమైన సేవలను అందిస్తున్నారని కొనియాడారు. ఆదివారం 58వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలోని హోంగార్డులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ వారు గతంలో ఎన్నడూ లేని విధంగా నెలకు రూ.18 వేల నుంచి రూ. 21,300 పొందుతున్నారు. 15000 హోంగార్డు కుటుంబాలకు యాక్సిస్ బ్యాంకు ఇన్సూరెన్స్ పథకంతో అనుసంధానం చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ పథకం ద్వారా వచ్చే సంవత్సరం జనవరి 1 నుండి ఏదైనా ఆకస్మిక మరణం సంభవిస్తే, హోంగార్డు కుటుంబానికి 60 లక్షల భీమా చెల్లించబడుతుంది.

వ్యక్తిగత ప్రమాద భీమా పాలసీని ఈ ఏడాది 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగింది. హోంగార్డుల సరైన ఆరోగ్య సంరక్షణ కోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పన్నెండు వేల ఐదు మంది హోంగార్డులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్డులు జారీ చేయబడ్డాయి. మహిళా హోంగార్డులకు మూడు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఇస్తున్నాము. ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్క హోంగార్డుకు ఈహెచ్‌ఎస్‌/ఆరోగ్యశ్రీ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. “అందరికీ హౌసింగ్” పథకం కింద ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు అర్హత ఉన్నవారికి ఇళ్లను కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు