ఏపీ నుంచే నేరుగా విదేశాలకు..

29 Nov, 2023 05:56 IST|Sakshi

ఏపీ భవన్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌–విమానయానం ద్వారా కనెక్టివిటీ’ అనే అంశంపై సమీక్ష

హాజరైన వైజాగ్, తిరుపతి, కడప, కర్నూలు ఎయిర్‌పోర్టుల డైరెక్టర్లు

సాక్షి, న్యూఢిల్లీ: ఇకపై విదేశాలకు వెళ్లేవారు హైదరాబాద్‌తో సంబంధం లేకుండా ఏపీ నుంచే నేరుగా వెళ్లేలా విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరముందని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. అందుకు సంబంధించి మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన అవసరమన్నారు. రాష్ట్ర విమానయాన రంగంపై ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌–విమానయా­నం ద్వారా కనెక్టివిటీ’ అనే అంశంపై లవ్‌ అగర్వాల్‌ అధ్యక్షతన మంగళవారం సమీక్షా సమావేశం జరి­గింది.

ప్రభుత్వ సలహాదారుడు ఆదిత్యనాథ్‌ దాస్, ప­రిశ్రమలు, వాణిజ్యశాఖ సెక్రటరీ యువరాజ్, ఏపీ భవన్‌ అడిషినల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ హిమాన్షు కౌశిక్, విశాఖ, తిరుపతి, కడప, కర్నూలు ఎయిర్‌ పోర్టుల డైరెక్టర్లు, వివిధ ప్రైవేటు విమానయాన సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈసందర్భంగా లవ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ఏపీలోని వివిధ పట్టణాల మధ్య విమాన సర్వీసులను పెంచడం ద్వారా ప్రజలకు మెరుగైన ప్రయాణం, రవా­ణా సదుపాయాల్ని కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విమానయాన సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.  

‘ఈజ్‌ ఆఫ్‌ ట్రావెల్‌’ ద్వారానే సాధ్యం
విమానయానం ద్వారా ఈశాన్య భారతాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తున్నప్పుడు.. ఆ సౌకర్యాలు ఏపీకి ఎందుకు కల్పించలేకపోతున్నారని ఎయిర్‌పోర్టు డైరెక్టర్లను అగర్వాల్‌ ప్రశ్నించారు. ‘ఈజ్‌ ఆఫ్‌ ట్రావెల్‌’ ద్వారానే ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణాల మధ్య, రాష్ట్ర పట్టణాలకు దేశంలోని ఇతర పట్టణాలతో కనెక్టివిటీని పెంచేందుకు తోడ్పాటు ఇవ్వాలని సూచించారు.

ముఖ్యంగా విశాఖ నుండి రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు, సమీప నగరాలైన భువనేశ్వర్, కలకత్తాలకు సర్వీసులు అవసరమన్నారు. వీటితో పాటు థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక, సింగపూర్‌ వంటి దేశాలకు విమాన సర్వీసులను నడపాల్సిన అవసరం ఉందని వివరించారు. సుమారు రెండు కోట్ల మంది తమ విమాన ప్రయాణం కోసం విశాఖపట్నం విమానాశ్రయంపై ఆదారపడుతున్నారని చెప్పారు. మరోపక్క తిరుమలకు ప్రతిరోజూ వచ్చే లక్ష మంది భక్తులకు విమాన సర్వీసును అందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

3 కారిడార్లు గల ఏకైక రాష్ట్రం ఏపీనే
దేశంలో మూడు పారిశ్రామిక కారిడార్లు గల ఏకైక రాష్ట్రం ఏపీనే అని వాణిజ్య శాఖ సెక్రటరీ ఎన్‌.యువరాజ్‌ తెలిపారు. దేశంలో రెండవ పొడవైన సముద్ర తీర ప్రాంతం గల ఏపీకి విస్తృత అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా నుండి ప్రజలు అధిక సంఖ్యలో వారణాసికి వెళుతుంటారని, వారి సౌకర్యార్థం వారణాసికి విమాన సర్వీసులను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. 

మరిన్ని వార్తలు