ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

14 Aug, 2020 15:38 IST|Sakshi

సాక్షి, విజయవాడ:  ఆంధ్రప్రదేశ్‌లో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం ప్రకటించారు.  సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇ‍క సెప్టెంబర్‌ 10,11 తేదీల్లో ఐసెట్‌, 14న ఈసెట్‌, 28,29,30 తేదీల్లో ఏపీ పీఈసెట్‌, అక్టోబర్‌ 1న ఎడ్‌సెట్‌, 2వ తేదీన లాసెట్‌ నిర్వహించనుంది. ఎంసెట్, సహ వివిధ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్‌లోనే నిర్వహించాలని ముందు షెడ్యూళ్లు ఇచ్చినా కరోనా, లాక్‌డౌన్‌ల కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. సెప్టెంబర్‌ మూడో వారంలో ఈ పరీక్షలను నిర్వహించాలని, అక్టోబర్‌ 15నుంచి తరగతులు ప్రారంభించాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి తాజా షెడ్యూల్‌ను రూపొందించింది.

ఇక తెలంగాణలో ఈ నెల 31న ఈసెట్, వచ్చే నెల 2న పాలిసెట్, వచ్చే నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రికల్చర్‌ ఎంసెట్‌ సహా లాసెట్, పీజీ ఈసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీఈసెట్‌ తేదీలను మాత్రం పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్‌ స్లాట్స్‌ను బట్టి ఖరారు చేయనుంది.

మరిన్ని వార్తలు