మే 15 నుంచి ఏపీ ఈఏపీసెట్‌.. షెడ్యూల్‌ విడుదల

24 Jan, 2023 04:42 IST|Sakshi

మే 5న ఈసెట్‌ అదే నెల 20న లాసెట్, ఎడ్‌సెట్‌ 

25, 26 తేదీల్లో ఐసెట్‌ పలు ప్రవేశపరీక్షల షెడ్యూళ్లు విడుదల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఈఏపీ సెట్‌)ను మే 15 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి సోమ­వారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈఏపీసెట్‌లో భాగంగా మే 15 నుంచి 22 వరకు ఎంపీసీ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఇక మే 23, 24, 25 తేదీల్లో బైపీసీ విభాగం ప్రవేశపరీక్షలు ఉంటాయి.  

ఈసారి ముందుగానే.. 
రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఇతర ప్రవేశపరీక్షల షెడ్యూళ్లను కూడా ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీజీసెట్, ఆర్‌సెట్లను గతంలో కన్నా ముందుగా నిర్వహించి.. త్వరగా ప్రవేశాలు పూర్తి చేసేలా షెడ్యూళ్లను రూపొందించింది.

గాడిన పడనున్న విద్యా సంవత్సరం.. 
గతంలో కరోనాతో ప్రవేశపరీక్షల నిర్వహణ ఆలస్యం కావడంతో విద్యాసంవత్సరం గాడితప్పింది. ఈ పరిస్థితి మన రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా నెలకొంది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి 2023–24 విద్యాసంవత్సరానికి ప్రవేశ పరీక్షలను గతంతో పోలిస్తే చాలా ముందుగానే పూర్తి చేసేలా వివిధ సెట్ల షెడ్యూళ్లను రూపొందించింది. ఫలితంగా ఈసారి విద్యా సంవత్సరం గాడిలో పడటానికి ఆస్కారమేర్పడింది.

ఈసారి ఈఏపీసెట్‌ పరీక్షలను గతేడాది కంటే రెండు నెలలు ముందుగా అంటే మే 15 నుంచే ప్రారంభించనుండడం విశేషం. దీనివల్ల జూన్‌ ఆఖరుకల్లా అడ్మిషన్లతో సహా మొత్తం పక్రియ పూర్తవుతుంది. దీంతో జూలై నుంచే తరగతులు ప్రారంభించవచ్చని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొన్నాయి

>
మరిన్ని వార్తలు