ఏపీ ఈసెట్‌ పరీక్ష నేడే

19 Sep, 2021 04:07 IST|Sakshi

హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా 48 కేంద్రాల్లో నిర్వహణ

34,271 మంది విద్యార్థుల దరఖాస్తు

అనంతపురం విద్య: ఏపీ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష (ఏపీ–ఈసెట్‌)–2021ను ఆదివారం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా 48 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఏపీ ఈసెట్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జింకా రంగజనార్ధన, కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సి. శశిధర్‌ వెల్లడించారు. ఇందులో అర్హత సాధించిన వారికి బీటెక్‌ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం కల్పిస్తారు. 13 బ్రాంచీల్లో నిర్వహించే కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌కు మొత్తం 34,271 మంది దరఖాస్తు చేశారు. ఆదివారం ఉ.9 నుంచి మ.12 గంటల వరకు ఏడు బ్రాంచ్‌లకు సంబంధించిన విద్యార్థులకు.. మ.3 నుంచి సా.6 గంటల వరకు ఆరు బ్రాంచ్‌ల విద్యార్థులకు పరీక్ష ఉంటుంది. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ పరీక్షకు 420, సిరామిక్‌ టెక్నాలజీకి 6, కెమికల్‌ ఇంజినీరింగ్‌కు 371, సివిల్‌ ఇంజినీరింగ్‌కు 5,606, కంప్యూటర్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌కు 2,249, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌కు 7,760, బీఎస్సీ (మేథమేటిక్స్‌)కు 58, ఈసీఈకి 6,330, మెకానికల్‌ ఇంజినీరింగ్‌కు 10,652, మెటలర్జికల్‌కు 147, మైనింగ్‌ ఇంజినీరింగ్‌కు 292, ఫార్మసీకి 140, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెన్‌టేషన్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించి 140 దరఖాస్తులు అందాయి. 

సూచనలు, నిబంధనలు ఇవే..
► ఉదయం సెషన్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు 7.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు 1.30 గంటలకు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద రిపోర్ట్‌ చేసుకోవాలి. 
► క్యాలిక్యులేటర్లు, మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకూడదు.
► బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేసిన నేపథ్యంలో చేతులకు గోరింటాకు, మెహందీ, టాటూ మార్కులు ఉండకూడదు. 
► ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. 
► పరీక్ష సమయం ముగిసేవరకూ కేంద్రం నుంచి బయటకు పంపరు.  

మరిన్ని వార్తలు