ప్రజల ప్రాణాలతో నిమ్మగడ్డ చెలగాటం

9 Jan, 2021 11:08 IST|Sakshi

అమరావతి: స్థానిక ఎన్నికలకు ఏకపక్షంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో నిమగ్నమై ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని పేర్కొన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పినా కూడా శుక్రవారం ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేయడం వివాదం రేపుతోంది. ఈ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. గతంలో కరోనా వ్యాప్తి తక్కువ ఉన్న సమయంలో ఎన్నికలు వాయిదా వేసిన ఎస్‌ఈసీ ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ ఉన్న సమయంలో ఎన్నికల నిర్వహణకు ముందుకువెళ్లడం వివాదానికి దారి తీస్తోంది.

ఏకపక్ష నిర్ణయం సరికాదు: ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని తాడేపల్లిగూడెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తెలిపారు. గతంలో తక్కువ కరోనా కేసులున్నప్పుడు ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో పంతానికి పోయి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారని చెప్పారు.  ఇది సరికాదని ఎమ్మెల్యే సత్యనారాయణ పేర్కొన్నారు. ఎవరి డైరెక్షన్‌లో నిమ్మగడ్డ పనిచేస్తున్నారో అందరికీ తెలుసని తెలిపారు. 

ప్రజల ప్రాణాలతో చెలగాటం
పంతాలకు పోయి తమను ఇబ్బంది పెట్టొద్దని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. పూర్తిస్థాయిలో పని చేసేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశాయి. ప్రజల ప్రాణాలతో ఎస్‌ఈసీ చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎస్‌ఈసీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి.

మరిన్ని వార్తలు