శ్రీశైలం, సాగర్‌లో ఉన్న నీళ్లన్నీ మావే

14 Mar, 2023 04:34 IST|Sakshi

కృష్ణా బోర్డు చైర్మన్‌కు ఏపీ ఈఎన్‌సీ లేఖ

కృష్ణా జలాల్లో మా కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగులు

తెలంగాణ కోటాకంటే అదనంగా 82.08 టీఎంసీలు వాడుకుంది

ఉమ్మడి ప్రాజెక్టుల్లో ఏపీ కోటాలో ఇంకా 148.06 టీఎంసీలు మిగులు

వీటిలో లభ్యతగా ఉన్న నీళ్లన్నీ ఏపీవే

వాటిని సాగు, తాగు నీటి కోసం విడుదల చేయాలని వినతి

సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో లభ్యతగా ఉన్న నీళ్లన్నీ తమవేనని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. రబీలో సాగు చేసిన పంటలను రక్షించుకోవడం, వేసవిలో తాగు నీటి కోసం ఆ నీటిని విడుదల చేయాలని కోరింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో కోటాకంటే 38.72 టీఎంసీలను అధికంగా ఏపీ వాడుకుందని తెలంగాణ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.

తెలంగాణ ప్రభుత్వమే కోటాకంటే అదనంగా 82.08 టీఎంసీలను వాడుకుందని తెలిపింది. మొత్తం కృష్ణా జలాల్లో ఏపీ కోటాలు ఇంకా 199.31 టీఎంసీలు మిగులు ఉందని తేల్చిచెప్పింది. ఉమ్మడి ప్రాజెక్టులైన  శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో ఏపీ కోటాలో ఇంకా 148.06 టీఎంసీలు మిగులు ఉన్నాయని స్పష్టంచేసింది. ఈ నీటిని మొత్తాన్ని ఏపీకి విడుదల చేయాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌కు ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి సోమవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు..

ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయికి చేరుకోక ముందే, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేసింది. విభజన చట్టం 11వ షెడ్యూలు 9వ పేరాలో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. బోర్డు అనుమతి తీసుకోకుండా విద్యుదుత్పత్తి కోసం వాడుకున్న నీటిని ఆ రాష్ట్ర కోటాలోనే కలపాలని ఆదిలోనే కోరాం.

♦ తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలంలో 392.45 టీఎంసీలు, సాగర్‌లో 295.24 టీఎంసీలను.. మొత్తం 687.69 టీఎంసీలను వాడుకుంది. ఇందులో వరద రోజుల్లో వాడుకున్న 359.76 టీఎంసీలు, బోర్డు అనుమతితో వాడుకున్న 126.86 టీఎంసీలను మినహాయిస్తే.. 201.07 టీఎంసీలు అక్రమంగా వాడుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నీరంతా వృథాగా సముద్రంలో కలిసింది.  తెలంగాణ విద్యుదుత్పత్తి చేయకుండా ఉంటే 201.07 టీఎంసీలు ఉమ్మడి ప్రాజెక్టుల్లో నిల్వ ఉండేవి. రెండు రాష్ట్రాల సాగు, తాగు అవసరాలకు ఉపయోగపడేవి.

 వరద వచ్చే రోజుల్లో జూరాల, శ్రీశైలం, సా­గ­ర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌ గేట్లు ఎత్తేసి సముద్రంలో జలాలు కలిసే సమయంలో ఏపీ ప్రభుత్వం 191.09 టీఎంసీలు, తెలంగాణ 48.488 టీఎంసీలు వాడుకున్నాయి. ఆ నీటిని ఏ రాష్ట్ర కోటాలో కలపకూడదు.

♦ రెండు రాష్ట్రాల సంయుక్త లెక్కల ప్రకారం జూరాలలో తెలంగాణ 42.22 టీఎంసీలను వాడుకుంది. కానీ, కృష్ణా బోర్డుకు మాత్రం 35.959 టీఎంసీలే వాడుకున్నట్లు తప్పుడు లెక్కలు చెప్పింది. అంటే జూరాల నుంచి అదనంగా 6.261 టీఎంసీలను తెలంగాణ వాడుకుంది.

♦  పాకాల చెరువు, వైరా, పాలేరు, లంకసాగర్, ఆర్డీఎస్, కోయిల్‌సాగర్‌ వంటి చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల కింద తెలంగాణ వాడుకుంటున్న నీటి వివరాలను 2021 నుంచి బోర్డు దృష్టికి తీసుకురాలేదు.

♦   2022–23 నీటి సంవత్సరంలో ఫిబ్రవరి 28 వరకు కృష్ణా బేసిన్‌లో 972.46 టీఎంసీల లభ్యత ఉంది. ఇందులో ఏపీ వాటా 641.82 (66 శాతం), తెలంగాణ వాటా 330.64 (34 శాతం) టీఎంసీలు. ఫిబ్రవరి వరకు రెండు రాష్ట్రాలు 846.71 టీఎంసీలను వాడుకున్నాయి. ఇందులో ఏపీ వాడుకున్నది 442.52 (52.2 శాతం), తెలంగాణ వాడుకున్నది 404.20 (47.8 శాతం) టీఎంసీలు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీ కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగిలే ఉన్నాయి. తెలంగాణ ఆ రాష్ట్ర కోటా కంటే 73.56 టీఎంసీలు అదనంగా వాడుకుంది.

♦  ఉమ్మడి ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీటిలో ఏపీ కోటాలో ఇంకా 148.06 టీఎంసీలు మిగిలి ఉంటే.. తెలంగాణ అదనంగా 82.08 టీఎంసీలను వాడుకుంది. 

♦  తక్షణమే నీటి లెక్కలను తేల్చి.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లో నీటిని వాడుకోకుండా తెలంగాణను కట్టడి చేయండి. ఆ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించండి. 

మరిన్ని వార్తలు