జూలైలో మఠాధిపతుల భేటీ

24 Jun, 2021 07:36 IST|Sakshi
బ్రహ్మంగారి మఠం

బ్రహ్మంగారి మఠం వివాదాన్ని పరిష్కరించేందుకు దేవదాయ శాఖ చర్యలు

మఠాధిపతి ఎంపిక సాఫీగా జరిగేందుకు ప్రత్యేకాధికారి నియామకం  

సాక్షి, అమరావతి: కుటుంబ సభ్యుల మధ్య వివాదం కొలిక్కి రాకపోవడంతో.. బ్రహ్మంగారి మఠం వివాదాన్ని పరిష్కరించేందుకు దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. తదుపరి మఠాధిపతి ఎంపిక కోసం జూలై నెలాఖరులో సమావేశం నిర్వహించబోతోంది. దీనికి వివిధ మఠాధిపతులు విచ్చేసి.. కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. వారితో చర్చించిన అనంతరం మఠాధిపతి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ సమావేశం నిర్వహణ కోసం జాయింట్‌ కమిషనర్‌ ఆజాద్‌ను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు బుధవారం ఉత్తర్వులిచ్చారు.

ప్రస్తుత సమస్యను పరిష్కరించాలంటే నిబంధనల ప్రకారం.. బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయాలను అనుసరించే దేవదాయ శాఖ పరిధిలోని మఠాధిపతులతోనే సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. దేవదాయ శాఖ పరిధిలో 128 మఠాలున్నాయి. ఇందులో 13.. బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయాల ప్రకారం పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. అవకాశాన్ని బట్టి ఆ 13 మంది మఠాధిపతులు గానీ.. లేదంటే అందులో ఐదుగురు గానీ.. కుటుంబ సభ్యులతో సమావేశమవుతారు. ఇందులో వచ్చే అభిప్రాయం మేరకు మఠాధిపతిని ఎంపిక చేస్తారు. ఈ సమావేశాన్ని బ్రహ్మం గారి మఠంలో గానీ లేదంటే కడప, విజయవాడలో గానీ నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. 

30 రోజుల ముందస్తు నోటీసుతో..
ధార్మిక పరిషత్‌ నిబంధనల ప్రకారం.. సమావేశం నిర్వహణ కోసం 30 రోజుల ముందు ఆయా మఠాధిపతులతో పాటు సంబంధిత కుటుంబసభ్యులకు çసమాచారం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకాధికారి ఆజాద్‌ ఒకటి, రెండు రోజుల్లో బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించి రికార్డులు పరిశీలిస్తారు. అనంతరం మఠాధిపతుల సమావేశం ఏర్పాటుకు ఈ నెల 28, 29 తేదీల్లో మీడియా ప్రకటన రూపంలో నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆ మీడియా నోటిఫికేషన్‌ జారీ అనంతరం 30 రోజులకు సమావేశం నిర్వహిస్తారు.
చదవండి: మన పిల్లలకు హైఎండ్‌ స్కిల్స్‌ నేర్పించాలి 

>
మరిన్ని వార్తలు