AP: విద్యుత్‌ కోతలు తాత్కాలికమే

9 Apr, 2022 11:38 IST|Sakshi
ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ కొరత కారణంగా ఎదురవుతున్న కరెంట్‌ కోతల నుంచి ఈ నెలాఖరుకల్లా ఉపశమనం కలుగుతుందని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్‌ తెలిపారు. బొగ్గు కొరత, రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్‌ వినియోగం, దేశీయంగా బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్‌తో ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితులు తాత్కాలికమేనని, త్వరలోనే విద్యుత్‌ అందుబాటులోకి వచ్చి, అంతా చక్కబడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్‌ పరిస్థితిపై ‘సాక్షి ప్రతినిధి’కి శుక్రవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

బొగ్గు దొరకడంలేదు
గతేడాది అక్టోబర్‌ నుంచి అంతర్జాతీయంగా చైనా వంటి దేశాలు తీసుకున్న నిర్ణయాలవల్ల దేశంలో బొగ్గు కొరత ఏర్పడింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు వినియోగం పెరిగి లభ్యత తగ్గిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసి రాష్ట్రాలకు కోటా నిర్ణయించి బొగ్గు కేటాయింపులు ప్రారంభించింది. మార్చిలో మళ్లీ బొగ్గు సంక్షోభం వస్తుందని, నిల్వలు పెట్టుకోమని సూచించింది. కానీ, దొరకడంలేదు. 5 లక్షల మెట్రిక్‌ టన్నుల కోసం మూడుసార్లు టెండర్లు పిలిచాం. రూ.6 వేలు ఉండే బొగ్గు టన్ను రూ.17 వేల నుంచి రూ.40 వేలు పలుకుతుండటంతో ఆ ధరకు టెండరు ఇవ్వలేకపోతున్నాం. దీంతో కృష్ణపట్నంలో 800 మెగావాట్ల ఉత్పత్తి జరగడంలేదు.

మార్చిలో రూ.1,258 కోట్లతో విద్యుత్‌ కొనుగోలు
ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు దాదాపు 60 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ప్రతిరోజూ సింగరేణి కాలరీస్, మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి 10 నుంచి 12 ర్యాకులు వస్తోంది. ఇది ఏ రోజుకారోజు ఉత్పత్తికి సరిపోతోంది. నిల్వ చేసుకోవడం కుదరడంలేదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలుకు పోటీ పెరిగింది. కానీ, పవర్‌ ఎక్సే్ఛంజ్‌లో 14వేల మెగావాట్లు వరకూ అందుబాటులో ఉండే విద్యుత్‌ ప్రస్తుతం 2 వేల మెగావాట్లు మాత్రమే ఉంది. దీనిని కొనేందుకు దేశంలోని డిస్కంలన్నీ పోటీపడుతున్నాయి. ఇక్కడ యూనిట్‌ ప్రస్తుతం రూ.12 వరకూ ఉంది. ఆ రేటుకి కొందామన్నా కూడా దొరకడంలేదు. మార్చిలో రూ.1,258 కోట్లతో 1,551 మిలియన్‌ యూనిట్లు కొనుగోలు చేశాం.

పల్లెల్లో గంట.. పట్టణాల్లో అరగంట..
గ్రిడ్‌ డిమాండ్‌ బాగా పెరిగినప్పుడు గృహాలకు గ్రామాల్లో ఒక గంట, పట్టణాల్లో అరగంట అధికారిక లోడ్‌ రిలీఫ్‌ అమలుచేయాల్సిందిగా డిస్కంలకు ఆదేశాలిచ్చాం. కోవిడ్‌ పూర్తిగా అదుపులోకి రావడంతో పరిశ్రమలు పూర్తిస్థాయిలో పనిచేయడం, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పెరగడంవల్ల విద్యుత్‌ వాడకం పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్‌ డిమాండ్‌ 235 మిలియన్‌ యూనిట్లు ఉంది. 2021తో పోలిస్తే 3.54 శాతం, 2020తో పోల్చితే 46 శాతం ఎక్కువ వినియోగం జరుగుతోంది. ఏపీజెన్‌కో, ఏన్టీపీసీ నుంచి 120 మిలియన్‌ యూనిట్లు ధర్మల్‌ విద్యుత్‌ అందుబాటులో ఉంది. జల, సౌర, పవన, న్యూక్లియర్‌ విద్యుత్‌ మొత్తం కలిపి 180 మిలియన్‌ యూనిట్ల వరకూ అందుబాటులో ఉండగా మరో 40–50 మిలియన్‌ యూనిట్లు కొనాల్సి వస్తోంది.

పెరిగిన వ్యవసాయ వినియోగం
2019లో దాదాపు 17.3 లక్షల వ్యవసాయ సర్వీసుండగా, 2022కి వాటి సంఖ్య 18.5 లక్షలకు చేరింది. అంతేకాక.. వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట విద్యుత్‌ సరఫరా అందించడంవల్ల రైతులు ఏడాది పొడవునా మూడు, నాలుగు పంటలు వేస్తున్నారు. ఫలితంగా వ్యవసాయ విద్యుత్‌ వినియోగం పెరిగింది. ఇలా 2018–19లో 10,832 మిలియన్‌ యూనిట్లు.. 2021–22లో 12,720 మిలియన్‌ యూనిట్లు జరిగింది. అంటే దాదాపు 20 శాతం పెరిగింది. అయినప్పటికీ రైతులకు ఇబ్బంది రాకుండా 9 గంటలు విద్యుత్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోంది.

నెలాఖరుకు కొరత తీరుతుంది
పరిశ్రమలు 50 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగించాలని, వారాంతపు సెలవుకు అదనంగా మరోరోజు పవర్‌ హాలిడే విధించాలని ఆంక్షలు పెట్టాం. దీనివల్ల 15 నుంచి 20 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ మిగులుతుంది. నెలాఖరుకల్లా పంట కోతలు పూర్తికానుండటంతో వ్యవసాయ విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. దానివల్ల కనీసం 15 మిలియన్‌ యూనిట్లు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నాం. పవన విద్యుత్‌ మే, జూన్‌ నెలల్లో మరికొంత అందుబాటులోకి వస్తుంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం రూ.12 ఉన్న యూనిట్‌ ధర కూడా రూ.4లకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఈ నెలాఖరుకి విద్యుత్‌ కొరత సమస్య తీరుతుంది. ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌కు ఈ ఆదా తోడయితే విద్యుత్‌ కోతలు ఉండవని భావిస్తున్నాం.

మొదలైన ‘పవర్‌ హాలిడే’
వ్యవసాయ, గృహ విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు పరిశ్రమలకు ఇంధన శాఖ ఈ నెల 22 వరకు ప్రకటించిన ‘పవర్‌ హాలిడే’ శుక్రవారం నుంచి రాష్ట్రంలో మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ (డిస్కం)లు తమ పరిధిలోని జిల్లాల వారీగా దీనిని అమలుచేస్తున్నాయి. పవర్‌ హాలిడే లేని రోజుల్లో పరిశ్రమలు ప్రతిరోజూ 50 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగించాలని.. షాపింగ్‌ మాల్స్‌ తరహాలోని వాణిజ్య సముదాయాల్లో కూడా 50 శాతం మేరకు తగ్గించుకోవాలని.. ప్రకటనలకు సంబంధించిన సైన్‌ బోర్డులకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయాలని, అలాగే ఏసీల వాడకాన్ని కూడా తగ్గించుకోవాలని డిస్కంల సీఎండీలు ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలపై వినియోగదారులు కాల్‌ సెంటర్‌ నంబరు 1912కు ఫోన్‌చేసి విద్యుత్‌ సమస్యలను పరిష్కరించుకోవచ్చని వారు సూచించారు.

చదవండి: వాళ్ల కడుపు మంటకు మందే లేదు: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు