ఐదేళ్లకే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు

15 May, 2021 09:48 IST|Sakshi

పాత పీపీఏలను సమీక్షించాలి

కేంద్రానికి స్పష్టం చేసిన రాష్ట్ర ఇంధన శాఖ

సాక్షి, అమరావతి: భవిష్యత్‌లో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏలు)ను ఐదేళ్లకే పరిమితం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఇంధన శాఖ కేంద్రానికి స్పష్టం చేసింది. విద్యుత్‌ సంస్థలను ఆర్థికంగా కుంగదీస్తున్న పాత ఒప్పందాలను సమీక్షించాలని పేర్కొంది. వినియోగదారులకు నాణ్యమైన, చౌక విద్యుత్‌ అందించేందుకు ఖరీదైన పీపీఏలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించింది. కేంద్రం.. జాతీయ విద్యుత్‌ విధానాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా ముసాయిదా ప్రతిని రాష్ట్రాల ముందుంచింది.

దీనిపై కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఘనశ్యామ్‌ ప్రసాద్‌ శుక్రవారం అన్ని రాష్ట్రాల ఇంధన శాఖ కార్యదర్శులతో వర్చువల్‌ విధానంలో చర్చించారు. కొత్త పాలసీలోని ముఖ్యమైన అంశాలపై రాష్ట్రాల అభిప్రాయాలు చెప్పాలని కోరారు. ఈ నేపథ్యంలో పలు అంశాలను రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పవన, సౌర విద్యుత్‌లను జాతీయ స్థాయిలో లెక్కించి రాష్ట్రాలకు కేటాయింపులు జరపాలని సూచించారు. నిర్వహణ వ్యయం అదుపునకు అనుసరించాల్సిన పద్ధతుల్లో ట్రాన్స్‌మిషన్‌ విభాగంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పంప్డ్‌ స్టోరేజీల ఏర్పాటుకు రాష్ట్రంలో విస్తృత అవకాశాలున్నాయని, అయితే కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు త్వరితగతిన వచ్చేలా కేంద్రం చొరవ చూపాలని కోరారు.

చదవండి: ఏపీ: జూన్‌ 22న వైఎస్సార్‌ చేయూత 
కరోనా కాలం: పల్లెకు దూరమై.. చేనుకు చేరువై! 

మరిన్ని వార్తలు