చుక్కల భూములపై.. రైతులకు పూర్తి హక్కులు

20 Mar, 2023 08:18 IST|Sakshi

12 ఏళ్లుగా ఇనామ్‌ భూముల్ని అనుభవిస్తున్న వారికి హక్కులు

పట్టణ భూములకూ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు

మూడు రెవెన్యూ బిల్లులకు ఆమోద ముద్ర వేసిన అసెంబ్లీ

సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్న చుక్కల భూములపై సంబంధిత రైతులకు పూర్తిస్థాయి హక్కులు కల్పించేందుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అదేవిధంగా కనీసం 12 ఏళ్లపాటు ఇనాం భూముల్ని అనుభవిస్తున్న వారికి ఆయా భూములపై సర్వహక్కులు లభించనున్నాయి. కాగా, అద్దె లేదా లీజుదారులు క్లెయిమ్‌ చేయని ఇనాం భూములు ప్రభుత్వ పరం కానున్నాయి.

గ్రామీణ ప్రాంత భూములకు జారీచేసే పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను ఇకనుంచి పట్టణ ప్రాంత భూములకు జారీ చేయనున్నారు. ఈ మేరకు ఉద్దేశించిన ఏపీ చుక్కల భూములు (పునఃపరిష్కార రిజిస్టర్‌ ఆధునికీకరణ) సవరణ బిల్లు, ఆంధ్ర ప్రాంత ఇనామ్‌ల (రద్దు, రైత్వారీలోనికి మార్పిడి) సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఈ మూడు బిల్లులను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టగా.. వీటిపై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు.

వక్ఫ్‌ భూముల్ని లీజుకిస్తే ముస్లింలకు మేలు
గుంటూరు నగరంలోని వక్ఫ్‌ బోర్డు భూములను నామమాత్రపు ధరలకు లీజుకిస్తే నిరుపేద ముస్లింలకు మేలు కలుగుతుందని గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే ముస్తఫా కోరారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన అధికారులు ఆ భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో సర్టిఫై చేస్తున్నారని, ఈ విధానంలో మార్పు రావాలని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. తిరుపతిలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న 60వేల మందికి హక్కులు కల్పించాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కోరారు. పలు మఠాలకు చెందిన భూముల్లో ఏళ్ల తరబడి వేలాది మంది ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారని వారికి కూడా హక్కులు కల్పించాలన్నారు.

రాయలసీమలో ఎంతో మందికి లబ్ధి
వ్యక్తిగత ఇనామ్‌ భూములను రెగ్యులరైజ్‌ చేయడంతో రాయలసీమలో వేలాది మందికి లబ్ధి చేకూరుతుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేవదాయ, సర్వీస్‌ ఈనామ్‌ భూముల రెగ్యులరైజేషన్‌లో తగిన జాగ్రత్తలు పాటించాలని, దేవాలయాలకే తగిన హక్కులు కల్పించాలని సూచించారు. డీకేటీ భూముల విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక రకమైన విధానం, ఇక్కడ మరో విధానం అమలులో ఉందని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆయా రాష్ట్రాల్లో అనివార్య, అత్యవసర పరిస్థితుల్లో ఆ భూములు అమ్ముకోవడానికి వీలుందన్నారు. మన దగ్గర కూడా అదే రీతిలో ఆలోచన చేస్తే వేలాది మందికి మేలు జరుగుతుందన్నారు.

నాలుగేళ్లలో రెవెన్యూలో ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని  రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సమగ్ర భూసర్వే గ్రామీణ ప్రాంతాల్లో నిజమైన యజమానులకు, పత్రాలు లేని వారికి పూర్తి హక్కులు కల్పిస్తోందన్నారు. చుక్కుల భూములపై చేసే చట్టం వేలాది మందికి గొప్ప వరమన్నారు. ఏళ్ల తరబడి స్వాధీనంలో ఈ చుక్కల భూములను అమ్ముకోవడానికి వీల్లేకుండా ఉందని, 12 ఏళ్లు పూర్తి స్థాయిలో రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉంటే క్షేత్ర స్థాయిలో విచారణ చేసి పూర్తిస్థాయి హక్కులు కల్పించే ఈ చట్టం చాలా గొప్పదని, వీటిపై అధికారులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. 

గ్రామ స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు: మంత్రి ధర్మాన
అవినీతికి ఆస్కారం లేని రీతిలో గ్రామస్థాయిలోనే రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించబోతున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. మ్యుటేషన్‌ కోసం కూడా గ్రామం విడిచి వెళ్లనవసరం లేకుండా చేస్తామన్నారు. కొత్తగా తీసుకొచ్చిన మూడు బిల్లులపై రెవెన్యూ యంత్రాంగానికి అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు మూడు ప్రాంతీయ సదస్సులు నిర్వహించామన్నారు.
చదవండి: ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌.. వారికి మాత్రమే ఛాన్స్..!

మరిన్ని వార్తలు