వరద నష్టం రూ.8,084.38 కోట్లు

12 Nov, 2020 02:43 IST|Sakshi
కేంద్ర బృందంతో సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు, అధికారులు

వ్యవసాయ, అనుబంధ రంగాలకు 3,084.6 కోట్లు.. 

ఇతర రంగాలకు రూ. 4,999.78 కోట్లు నష్టం 

సీఎంతో సమావేశమైన కేంద్ర బృందం ప్రతినిధులు 

వాస్తవాల నివేదన, వీలైనంత సాయానికి సిఫారసు చేయాలి 

తడిసిన, రంగుమారిన ధాన్యం, వేరుశనగ కొనుగోలుకు ఎఫ్‌ఏక్యూ సడలించాలి 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వినతి నష్టం అపారం.. ఆదుకునేలా చూస్తాం: కేంద్ర బృందం  

సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలోని వివిధ రంగాలకు జరిగిన అపార నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి కళ్లకు కట్టేలా నివేదించి విపత్తు బాధిత రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ సాయం అందించేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర బృందానికి విన్నవించారు. రెండు రోజులపాటు జిల్లాల్లో పర్యటించి, కుండపోత వర్షం, వరద నష్టాలను పరిశీలించి.. వివిధ వర్గాలతో మాట్లాడిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్‌ రాయ్‌ నేతృత్వంలోని కేంద్ర బృందం ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. షెడ్యూలులో లేనప్పటికీ అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు అనంతపురం జిల్లాలో కూడా పర్యటించినందుకు కేంద్ర బృందానికి సీఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కరువు, భారీ వర్షాలు, వరదలు లాంటి విపత్తులతో రాష్ట్రం దారుణంగా నష్టపోతోందని, విపత్తు భాధిత రాష్ట్రంగా మారిందని అధికారులు వివరించారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ఉదారంగా సాయం చేసేలా సిఫార్సు చేయాలని కోరారు. అధికారులు ఇంకా ఏం చెప్పారంటే.. 

► ఆగస్టు – అక్టోబర్‌ నెలల మధ్య తుపాన్లు, అల్పపీడనాలతో భారీ వరదల వల్ల భారీగా పంట నష్టం వాటిల్లింది. రహదారులు దెబ్బతిన్నాయి. వివిధ రంగాలకు రూ.8,084.38 కోట్ల పైగా నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ.3,084.6 కోట్లు నష్టం వాటిల్లింది.
► శాశ్వత పునరుద్ధరణ పనులకు రూ.4,439.14 కోట్లు, దెబ్బతిన్న రహదారులు, చెరువులు, వంతెనలు తదితర మౌలిక సదుపాయాల తాత్కాలిక పునరుద్ధరణకు రూ.3,645.25 కోట్లు అవసరం. జాతీయ విపత్తు సహాయ నిధి నిబంధనావళి ప్రకారం మౌలిక సౌకర్యాల తాత్కాలిక పునరుద్ధరణ, రైతులకు పెట్టుబడి సాయం కలిపి రూ.1,236.66 కోట్లు విడుదల చేయాలి. 
► ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, హోంమంత్రి మేకతోటి సుచరిత,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, విపత్తు నిర్వహణ ప్రత్యేక కమిషనర్‌ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

ఎక్కువ సాయం అందేలా చూడండి
భారీ వరదల వల్ల రూ.8,084.38 కోట్ల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. మీరు ఐదు జిల్లాల్లో పర్యటించి నష్టాలను స్వయంగా చూశారు. మీరు చూసిన విషయాలను, జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి యథాతథంగా నివేదించి జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్డీఆర్‌ఎఫ్‌) నిబంధనల ప్రకారం వీలైనంత ఎక్కువ సాయం అందించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయండి. వేరుశనగ, వరి దారుణంగా దెబ్బతిన్న విషయం మీరు చూశారు. పోయింది పోనూ మిగిలిన దానిని రైతులు నూర్పిళ్లు చేస్తారు. తడిసిన, రంగు మారిన ధాన్యం, వేరుశనగ కొనుగోలు చేసేందుకు వీలుగా ఫెయిర్‌ ఆవరేజ్‌ క్వాలిటీ (ఎఫ్‌ఏక్యూ) నిబంధనలు సడలించేలా సిఫార్సు చేయండి. తడిసిన, రంగు మారిన ధాన్యం, వేరుశనగ సేకరణకు ఎఫ్‌ఏక్యూ నిబంధనలను తప్పకుండా మినహాయించాల్సి ఉంది.
– కేంద్ర బృందంతో సీఎం వైఎస్‌ జగన్‌ 

ఎక్కువ సాయానికి సిఫార్సు చేస్తాం
కొన్ని రోజుల ముందు వచ్చి ఉంటే జరిగిన నష్టం ఇంకా స్పష్టంగా  కనిపించేది. ఇప్పటికీ అధిక నష్టం జరిగినట్లు మా పరిశీలనలో గుర్తించాం. అధికారులు కూడా బాగా సహకరించడంతోపాటు ఫొటో ఎగ్జిబిషన్ల ద్వారా నష్టాన్ని కళ్లకు కట్టారు. రైతులకు కోలుకోలేని నష్టం జరిగింది. ఎక్కువ సాయం అందించి కేంద్ర ప్రభుత్వం ఆదుకునేలా మేం సిఫార్సు చేస్తాం.    
– కేంద్ర బృందం   

మరిన్ని వార్తలు