కరోనా: 'ఊపిరి' నిలబెట్టాం..

18 May, 2021 03:03 IST|Sakshi

మరణాల నియంత్రణలో ఏపీ ముందంజ

సాక్షి, అమరావతి: దేశంలో కరోనా మరణాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మరణాల సంఖ్య ఏపీలో చాలా తక్కువగా నమోదైనట్టు తేలింది. ఏపీతో పోలిస్తే కేరళ మాత్రమే గణనీయమైన ప్రతిభ కనబరిచింది. ఆ తర్వాతి స్థానం ఏపీదే. మౌలిక వసతులు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, పెద్ద నగరాలున్న రాష్ట్రాలను సైతం మరణాల నియంత్రణలో ఏపీ వెనక్కు నెట్టింది. దేశంలోనే అత్యధికంగా పంజాబ్‌లో 2.38 శాతం మరణాలు చోటు చేసుకున్నాయి. ఉత్తరాఖండ్‌ 1.63 శాతంతో 2వ స్థానంలో ఉంది. కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాలు సైతం మరణాల నియంత్రణలో ఏపీ కంటే వెనుకబడ్డాయి.

మరణాల నియంత్రణే కీలకం
పాజిటివ్‌ కేసులెన్ని నమోదయ్యాయన్నది ముఖ్యంకాదు. మరణాలను బట్టే ఆ రాష్ట్రంలో పరిస్థితులను లెక్కిస్తారు. సాధారణంగా ఒక శాతం కంటే తక్కువగా మరణాలుంటే ఆ రాష్ట్రంలో పరిస్థితులు అదుపులో ఉన్నట్టుగా భావిస్తారు. ఈ నెల 17 నాటికి ఏపీలో వంద పాజిటివ్‌ కేసులకు 0.65 మరణాలు మాత్రమే నమోదవుతున్నాయి. మరణాలను మరింత తగ్గించేందుకు ముందస్తుగా బాధితులను గుర్తించేందుకు ఫీవర్‌ సర్వే చేస్తున్నారు. లక్షణాలున్న వారికి హోం ఐసొలేషన్‌ కిట్లు ఇచ్చి తీవ్రతను తగ్గించడం, మిగతా వారికి వ్యాపించకుండా చూడటం చేస్తున్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, గ్రామ, వార్డు వలంటీర్లు అలుపెరుగకుండా పనిచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు