విశాఖలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

1 Nov, 2020 11:37 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినం సందర్భంగా రాష్ట్రమంతటా వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశాఖ కలెక్టర్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జి మంత్రి కురసాల కన్నబాబు, మంత్రి అవంతి శ్రీనివాసరావు, తెలుగు భాష సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ పాల్గొన్నారు. జాతీయ పతానికి గౌరవ వందనం చేసి, పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  (పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన సీఎం)

ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు పోరాట పటిమ ఉంది. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు అభివృద్ధికి శ్రీకారం చూడుతుంది. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుంది. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాభివృద్ధికి కొందరు అడ్డుపడినా.. వెనకడుగు వేయకుండా ప్రభుత్వం అభివృద్ధి దిశగా వెళ్తోంది. జిల్లాలో 2.53 లక్షల మందికి 4,457 ఎకరాల ప్రభుత్వ, అసైన్ భూమి సేకరించి త్వరలో లబ్దిదారులకు అందిస్తాం. తెలుగు వారు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 

విశాఖ పరిపాలనా రాజధానిగా ఎదుగుతోందని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనావాస్‌ అన్నారు. 'జిల్లాలో ఎక్కువగా ఉన్న ప్రభుత్వ భూమిని ఉపయోగించి అభివృద్ధి చేస్తాం. విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేసి ప్రపంచంలోనే బెస్ట్‌ సిటీగా అవతరించేలా చేస్తాం' అని మంత్రి అన్నారు. తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ... మన రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1నాడే చేయాలి. మన నుంచి తెలంగాణ వేరు పడింది కానీ మన రాష్ట్రం అలాగే ఉంది. రాష్ట్రంలో తెలుగు అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి సీఎం జగన్‌ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు