ముందస్తు నీటి విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

16 May, 2022 18:31 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: రాబోయే ఖరీఫ్‌ సీజన్‌లో ముందస్తుగానే వ్యవసాయానికి సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సమావేశమైన ఏపీ క్యాబినెట్‌  తీర్మానించింది. ఈ విషయాన్ని రైతాంగానికి తెలియజేసింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వర్షాలు కురుస్తుండడంతో సాగునీటికి కొరత లేదు. ఖరీఫ్‌కు ముందస్తుగా నీటిని విడుదల చేస్తే నవంబరు, డిసెంబరు వరకు రైతులు పంటలు సాగు చేసుకుని తుపానుల వల్ల నష్టపోయే పరిస్థితి ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వచ్చే ఖరీఫ్‌కు ముందస్తుగానే నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. రైతాంగం ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తోంది. 

సాగునీటి వనరుల్లో పుష్కలంగా నీరు 
జిల్లాలోని జీఎన్‌ఎస్‌ఎస్, తెలుగుగంగ ప్రాజెక్టుల పరిధిలోని అన్ని సాగునీటి వనరులలో ప్రభుత్వం ముందస్తుగానే నీటిని నింపింది. గత ఏడాది నింపిన నీరు ఇప్పటికీ అలాగే ఉంది. జీఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలోని గండికోట, మైలవరం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి, పైడిపాలెంతోపాటు అటు తెలుగుగంగ పరిధిలోని ఎస్‌ఆర్‌–1, ఎస్‌ఆర్‌–2, బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్లలో నీరు ఉంది. ఈ రెండు సాగునీటి వనరుల పూర్తి నీటి సామర్థ్యం 76.608 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో 55.117 టీఎంసీల నీరు ఉంది. గండికోట పూర్తి సామర్థ్యం 26.850 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 23.900 టీఎంసీల నీరు ఉంది. బ్రహ్మంసాగర్‌ పూర్తి సామర్థ్యం 17.730 టీఎంసీ కాగా, ప్రస్తుతం 13.367 టీఎంసీల నీరు ఉంది. దీంతో రైతులకు ముందస్తుగా నీటిని విడుదల చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. 

2.50 లక్షల ఎకరాలకు సాగునీరు 
ప్రభుత్వం నిర్దేశించినట్లు జిల్లాలోని జీఎన్‌ఎస్‌ఎస్, తెలుగుగంగ పరిధిలోని సాగునీటి వనరుల కింద ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు సిద్ధమని అధికారులు చెబుతున్నారు. జీబీఆర్‌ రైట్‌ కెనాల్‌ కింద 26 వేల ఎకరాలకు, పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ కింద 35 వేల ఎకరాలకు, గండికోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కింద 7500 ఎకరాలు చొప్పున 68,500 ఎకరాలకు, అలాగే మై లవరం కింద జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాలలో 50 వేల ఎకరాలకు, సర్వరాయసాగర్, వామికొండ సాగర్‌ పరిధిలో కమలాపు రం నియోజకవర్గంలో 4500 ఎకరాలకు నీరివ్వనున్నారు.

ఇవికాకుండా పరోక్షంగా మరో 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఇక తెలుగుగంగ ప్రాజె క్టు పరిధిలోని ఎస్‌ఆర్‌–1, ఎస్‌ఆర్‌–2, బ్రహ్మంసాగర్‌ల పరిధిలో 1,40,000 ఎకరాల ఆయకట్టు ఉండగా, ఖరీఫ్‌లో 96,485 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. ఇ క్కడ కూడా దాదాపు 20 వేల ఎకరాలకు అనధికారికంగా నీరు అందనుంది. రెండు సాగునీటి ప్రా జెక్టుల పరిధిలోని నీటి వనరుల కింద 2. 50 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు ఖరీఫ్‌లో సాగునీరు అందనుంది.  

ఏ నిమిషమైనా నీటి విడుదలకు సిద్ధం 
తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని బ్రహ్మంసాగర్, ఎస్‌ఆర్‌–1, ఎస్‌ఆర్‌–2ల పరిధిలో ప్రస్తుతం 15 టీఎంసీలకు పైగా నీరు ఉంది. ప్రభుత్వం ముందస్తుగా ఖరీఫ్‌కు నీటిని విడుదల చేయాలని ఆదేశిస్తే ఏ నిమిషమైనా నీటి విడుదలకు సిద్ధంగా ఉన్నాము. తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో 96,485 ఎకరాలకు నీటిని అందించనున్నాము.     
– శారద, ఎస్‌ఈ, తెలుగుగంగ ప్రాజెక్టు 
 

జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి ఆయకట్టుకు సాగునీరిస్తాం 
జీఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలోని సీబీఆర్,  పీబీసీ, జీకేఎల్‌ఐ, మైలవరం ప్రాజెక్టుల పరిధిలో తగితనంతగా నీరు ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖరీఫ్‌ సీజన్‌కుగాను ముందస్తుగానే నీళ్లు విడుదల చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ ప్రాజెక్టుల పరిధిలో 1,40,000 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నాము.     
– మల్లికార్జునరెడ్డి,ఎస్‌ఈ, జీఎన్‌ఎస్‌ఎస్‌

మరిన్ని వార్తలు