ఆంధ్రా అరటి.. చలో యూరప్

24 Feb, 2021 03:25 IST|Sakshi

ఎగుమతులను మరింతగా పెంచేందుకు సర్కారు కార్యాచరణ

ఈ ఏడాది ఎగుమతుల లక్ష్యం లక్ష టన్నులు

క్షేత్రస్థాయిలో సత్ఫలితాలిస్తున్న వైఎస్సార్‌ తోట బడులు

సాక్షి, అమరావతి: ‘ఆంధ్రా అరటి’ తీపిని ప్రపంచ దేశాలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అరటి సాగు, దిగుబడి, ఎగుమతుల్లో  ఇప్పటికే మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రం నుంచి రెండేళ్లుగా మధ్య తూర్పు దేశాలకు అరటి పండ్లు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఏడాది నుంచి యూరోపియన్‌ దేశాలతోపాటు లండన్‌కు సైతం ఎగుమతి చేయనున్నారు. కనీసం లక్ష టన్నుల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యాన శాఖ ఉపక్రమించింది. రాష్ట్రంలో ఈ ఏడాది 1,08,083 హెక్టార్లలో అరటి సాగు చేస్తుండగా.. 64,84,968 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. చక్కెరకేళి, గ్రాండ్‌–9, ఎర్ర చక్కెరకేళి, కర్పూర, అమృతపాణి, బుడిద చక్కెరకేళి, తేళ్ల చక్కెరకేళి, సుగంధ, రస్తోలి వంటి రకాలు  సాగవుతున్నాయి. వైఎస్సార్, అనంతపురం, ఉభయ గోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో అరటి సాగు ఎక్కువగా విస్తరించింది. 

పచ్చ అరటికి భలే డిమాండ్‌
రాష్ట్రంలో వివిధ రకాల అరటి సాగవుతున్నా.. నిల్వ సామర్థ్యం, తీపి అధికంగా ఉండే గ్రాండ్‌–9 (పచ్చ అరటి) మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతోంది. 2016–17 సంవత్సరంలో ఇక్కడి నుంచి ఎగుమతులకు శ్రీకారం చుట్టగా.. ఆ ఏడాది 246 టన్నుల అరటి పండ్లు ఎగుమతి అయ్యాయి. 2017–18లో 4,300 టన్నులు, 2018–19లో 18,500 టన్నులను ఎగుమతి చేశారు. గతేడాది కరోనా విపత్కర పరిస్థితులు తలెత్తినా 38,520 టన్నులను ఎగుమతి చేయగలిగారు. 

ముంబై కేంద్రంగా ఎగుమతులు
అరటి ఎగుమతులను పెంచే లక్ష్యంతో ఐఎన్‌ఐ, ఫార్మ్స్, దేశాయ్, మహీంద్ర అండ్‌ మహీంద్ర వంటి అంతర్జాతీయ ఎక్స్‌పోర్ట్‌ కంపెనీలతో రాష్ట్ర ఉద్యాన శాఖ ఒప్పందాలు చేసుకుంది. వీటితో పాటు మరో 10 మేజర్‌ కార్పొరేట్‌ కంపెనీల ద్వారా కనీసం లక్ష టన్నులను విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఒక్కొక్కటి 45 వ్యాగన్ల సామర్థ్యం గల ఆరు ప్రత్యేక రైళ్ల ద్వారా అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ముంబై నౌకాశ్రయానికి అరటి పండ్లను రవాణా చేశారు. అక్కడ నుంచి విదేశాలకు 20 వేల టన్నులను ఎగుమతి చేశారు. మరో రైలు ఈ నెల 27వ తేదీన బయల్దేరబోతుంది.

విత్తు నుంచి మార్కెట్‌ వరకు..
డ్రిప్‌ ఇరిగేషన్, టిష్యూ కల్చర్‌ను ప్రోత్సహించడంతో పాటు బడ్‌ ఇంజెక్షన్, బంచ్‌ స్ప్రే, బంచ్‌ స్లీవ్స్, రిబ్బన్‌ ట్యాగింగ్, ఫ్రూట్‌ కేరింగ్, ప్రీ కూలింగ్, వాషింగ్, గ్రేడింగ్‌ అండ్‌ ప్యాకింగ్, ట్రాన్స్‌పోర్ట్‌ ఇలా అన్ని విభాగాల్లోనూ నాణ్యతను పెంపొందించడమే లక్ష్యంగా.. విత్తు నుంచి మార్కెట్‌ వరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 12 జిల్లాల్లో 46 క్లస్టర్స్‌ను గుర్తించి ఐఎన్‌ఐ ఫరŠమ్స్, దేశాయ్‌ కంపెనీల సహకారంతో కడప, అనంతపురం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వైఎస్సార్‌ తోట బడుల పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫ్రూట్‌ కేరింగ్‌ కార్యకలాపాలను రైతులకు చేరువ చేస్తున్నారు.

ఆంధ్రా అరటే కావాలంటున్నారు
ఒమన్, ఖతార్‌ వంటి గల్ఫ్‌ దేశాల వ్యాపారులు ఆంధ్రా అరటి మాత్రమే కావాలంటున్నారని ఎక్స్‌పోర్టర్స్‌ చెబుతుంటే ఆశ్చర్యమేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మన అరటి కోసం ఎగుమతిదారులు పోటీపడుతున్నారు. ఇప్పటికే 10 మంది ఎక్స్‌పోర్టర్స్‌ ముందుకొచ్చారు. మరింత మంది రాబోతున్నారు. ఫ్రూట్‌ కేర్‌ యాక్టివిటీస్‌తో పాటు ఆర్‌బీకేల ద్వారా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్‌ తోటబడులు అరటి ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడంలో దోహదపడ్డాయి. ఈ ఏడాది హెక్టార్‌కు 65 నుంచి 70 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం.
– ఎం.వెంకటేశ్వర్లు, జాయింట్‌ డైరెక్టర్, ఉద్యాన శాఖ (పండ్ల విభాగం)

మరిన్ని వార్తలు