సారా బట్టీల్లోంచి.. సమాజంలోకి!

3 Aug, 2020 03:57 IST|Sakshi

సత్ఫలితాలనిస్తున్న ప్రభుత్వ చర్యలు

ఇందుకు నిదర్శనమే.. రాసనపల్లె 

ఆ ఊరంతా నాటు సారా తయారీ కుటుంబాలే..

ఇప్పుడు సర్కార్‌ ప్రత్యేక చర్యలతో జనజీవన స్రవంతిలోకి..

రాసనపల్లె..  
చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ఉన్న ఒక చిన్న ఊరు. 700 జనాభా మాత్రమే ఉన్న ఈ ఊరు నాటు సారా తయారీకి బాగా ప్రసిద్ధి. ఒక్క రోజులో 50 వేల లీటర్ల నాటు సారా కావాలన్నా తయారుచేసి ఇవ్వగల సత్తా ఈ ఊరి సొంతం. ఒకప్పుడు ఈ గ్రామంలోని అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటే అబ్బాయికి కట్న కానుకలతోపాటు ఓ బస్తా బెల్లం, రెండు కుండలు ఇచ్చేవారు. అంటే.. ఆ ఊరి అల్లుడు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ సారా తయారుచేసుకోవచ్చన్నమాట. అయితే.. ఇదంతా గతం.

ఇప్పుడు రాసనపల్లె మారింది
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాటు సారా తయారీ కట్టడికి, మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలు, సారా తయారీ కుటుంబాలకు అధికారులు కల్పించిన అవగాహన, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపడం వంటి చర్యలతో రాసనపల్లె మారింది. సారా తయారీని మానుకుని బాగు దిశగా ముందుకెళ్తోంది. యువకులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా రాణిస్తుండగా పెద్దలు వివిధ పనులు చేసుకుంటూ జీవనోపాధిని పొందుతున్నారు.
–చిత్తూరు అర్బన్‌ 

విద్యుత్, రేషన్‌ నిలిపేసినా..
రాసనపల్లెలో 160 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దాదాపు అన్ని కుటుంబాలు నాటు సారా తయారీపై ఆధారపడ్డవే. తమిళనాడు– కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుకు దగ్గరలో రాసనపల్లె ఉండటం వీరికి కలిసి వచ్చింది. రాసనపల్లె ప్రజల్ని మార్చడానికి 1990లో అధికారులు ఆ ఊరికి విద్యుత్‌ సరఫరా, రేషన్‌ నిలిపేశారు. అయినా ఒక్కరిలోనూ మార్పు రాలేదు.

సర్కార్‌ ప్రత్యేక దృష్టి
నాటుసారా తయారీ, అక్రమ మద్యం నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)ని రంగంలోకి దించింది. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా, ఇతర అధికారులు స్వయంగా రాసనపల్లెను సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. నాటుసారా తయారీ వల్ల ఊరికున్న చెడ్డపేరు, దీనివల్ల పాఠశాలల్లో చదువుకుంటున్న ఆ ఊరి పిల్లలపై ఉన్న వివక్ష వంటివాటిని వివరించారు. ప్రస్తుతం అక్రమ మద్యం తయారీదారులకు విధిస్తున్న కఠిన జైలు శిక్షలు కూడా గ్రామస్తుల్లో మార్పుకు కారణమయ్యాయి. 

ఇక వద్దనుకుంటున్నాం..
1990లో మా ఊరందరికీ మూడు నెలలపాటు రేషన్, రెండు నెలలుపాటు కరెంట్‌ కట్‌ చేశారు. అయినా మేమెవరం తగ్గలేదు. ప్రస్తుత ప్రభుత్వం బాగా సీరియస్‌గా ఉంది. ఏ రాజకీయ నాయకుడు మమ్మల్ని కాపాడనంటున్నారు. ఇక సారా తయారీ వద్దనుకుంటున్నాం.
– ప్రకాష్, మాజీ సర్పంచ్, రాసనపల్లె

మా జీవితాల్లో మార్పు వచ్చింది
రాసనపల్లె అంటే చాలు మమ్మల్ని దొంగల్లా చూసేవాళ్లు. కలెక్టర్‌ నుంచి ఎస్పీ వరకు మా ఊరు వచ్చి మాతో మాట్లాడారు. దీంతో మా జీవితాల్లో మార్పు వచ్చింది.                               – పీటర్, మాజీ ఎంపీటీసీ, రాసనపల్లె

ట్యాక్సీ తోలుకుంటున్నా..
ఒకప్పుడు నాటు సారా కాస్తూ పట్టుబడితే ఏదో ఒక పార్టీ నాయకులు విడిపించేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చిన పోలీస్‌ ఆఫీసర్‌.. సారా కాయనని రూ.5 లక్షలతో తహసీల్దార్‌ వద్ద షూరిటీ ఇవ్వమన్నారు. మళ్లీ సారా కాస్తే రూ.5 లక్షలు పోతాయన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకుని ట్యాక్సీ తోలుకుంటున్నా.                              
– దీపక్, రాసనపల్లె

ఆవులు మేపుకొంటున్నా
1984లో డబ్బుల్లేక చదువు మానేశా. దీంతో సారా బట్టీలు పెట్టాను. కొన్నాళ్లపాటు బాగానే జరిగినా నా పిల్లలకు తెలిస్తే ఏమనుకుంటారోననే దిగులు పట్టుకుంది. అన్నీ వదిలేసి రెండు ఆవులు మేపుకొంటున్నా.      
 – రాజేంద్ర, రాసనపల్లె

వారిని ఆదుకుంటాం..
రాసనపల్లెలో ప్రతి ఒక్క కుటుంబంతో స్వయంగా మాట్లాడాను. సారా తయారీని అందరూ మానుకుంటున్నారు. ఇదే సమయంలో వారి అవసరాలను గుర్తించడం, ఆర్థికంగా ఆదుకోవడానికి నివేదికలు రూపొందించాం. 
– డాక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా, జిల్లా కలెక్టర్, చిత్తూరు.

మరిన్ని వార్తలు