రొయ్యల క్రయవిక్రయాలపై ప్రభుత్వం అప్రమత్తం

28 Jul, 2020 05:10 IST|Sakshi

కలెక్టర్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు 

మార్గదర్శకాల విడుదల  

సాక్షి, అమరావతి: రొయ్యల క్రయ విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కలెక్టర్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. క్రయవిక్రయాలు రెవెన్యూ, మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణలో జరగాలని ఆదేశిస్తూ అధికారులు పాటించాల్సిన అంశాలపై మార్గదర్శకాలను విడుదల చేసింది. వారం రోజులుగా హేచరీస్‌ నిర్వాహకులు, ఎగుమతిదారులు కొనుగోళ్లు నిలిపివేయడం, ఒకవేళ కొనుగోలు చేసినా కిలోకు రూ.80 వరకు తక్కువ రేటును చెల్లిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఈ విషయాన్ని కొందరు రైతులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం.. ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఉన్న ప్రాంతాలకు ఇద్దరేసి అధికారులను నియమించింది. వారి మొబైల్‌ నంబర్లు రైతులకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కలెక్టర్‌ కార్యాలయాల్లోని కంట్రోల్‌ రూమ్‌లు పనిచేయనున్నాయి. రైతులు తమ సమస్యలను ఈ కంట్రోలు రూమ్‌లకు తెలిపితే అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన రేట్లకే ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నిర్వాహకులు రొయ్యలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  

మరిన్ని వార్తలు