ఇంటికే వస్తారు.. జబ్బుల్ని పట్టేస్తారు

26 Oct, 2020 19:38 IST|Sakshi

జీవన శైలి జబ్బుల్ని గుర్తించేందుకు సమగ్ర సర్వే

ఎంత ఖరీదైన మందులైనా ఉచితంగా ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి సమాచారం సేకరిస్తున్న 19 వేల మంది ఏఎన్‌ఎంలు

మధుమేహం, బీపీ, లెప్రసీ, రక్తహీనత, క్యాన్సర్‌ బాధితుల వివరాల నమోదు

ఇప్పటికే 19 శాతం సర్వే పూర్తి

మరో 90 రోజులపాటు మిగతా ఇళ్లకూ వెళ్లి సమాచారం సేకరణ

దేశంలో ఇదే అతి పెద్ద సర్వే అంటున్న అధికారులు

సాక్షి, అమరావతి: ప్రజలకు సంక్రమించే జీవన శైలి జబ్బులపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చురుగ్గా సర్వే జరుగుతోంది. దేశంలో ఎక్కడా చేయని విధంగా మధుమేహం, కుష్టు, హైపర్‌ టెన్షన్‌, క్యాన్సర్‌ తదితర జబ్బుల బారినపడిన వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. ఇప్పటికే 15 రోజులుగా సుమారు 19 వేల మంది ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి వ్యాధి లక్షణాలను పరీక్షిస్తున్నారు. మరీ ముఖ్యంగా రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి తక్షణమే ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా చికిత్స అందించడంతోపాటు అవసరమైన మందులను ఉచితంగా ఇస్తారు. మొత్తంగా రాష్ట్రంలోని 5.34 కోట్ల మంది ఆరోగ్య స్థితిగతులను ప్రతి ఇంటికీ వెళ్లి సేకరిస్తున్నారు. సమగ్ర సర్వే పూర్తి కావడానికి మరో 90 రోజులు పట్టే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద సర్వే అని అధికారులు పేర్కొంటున్నారు.

19 శాతం సర్వే పూర్తి
రాష్ట్రంలో ఇప్పటివరకూ 19.01 శాతం జనాభాను సర్వే చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 19.43 శాతం, పట్టణ ప్రాంతాల్లో 17.27 శాతం సర్వే పూర్తయింది. గ్లూకోమీటర్, హిమోగ్లోబిన్‌ మీటర్ల ద్వారా మధుమేహం, రక్తహీనతల్ని గుర్తిస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన సర్వేలో హైపర్‌ టెన్షన్‌ (రక్తపోటు) బాధితులు అధికంగా ఉన్నట్టు ప్రాథమికంగా తేలింది. దీనికి కొంచెం అటూఇటుగా మధుమేహ బాధితులూ ఉన్నారు. విచిత్రం ఏమంటే.. 35 ఏళ్లలోపు వారికి కూడా మధుమేహం లక్షణాలు ఉన్నట్టు తేలింది. (చదవండి: దసరా కానుక.. ఏపీ ప్రభుత్వం తీపి కబురు)

యాప్‌లో నమోదు చేసి..
ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలనూ ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. మొత్తం సర్వే పూర్తయ్యాక రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా వ్యాధి లక్షణాలున్న వారికి ఏ ఆస్పత్రిలో వైద్యం అందించాలి, ఎక్కడ మందులు ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. అనంతరం వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారింటికి ఏఎన్‌ఎంలు వెళ్లడం లేదంటే ఫోన్‌ ద్వారా వారిని ఆస్పత్రులకు పిలిపించి వైద్య సదుపాయం కల్పిస్తారు. ఈ వివరాలన్నీ 104 సేవలకు, పీహెచ్‌సీలకు అనుసంధానం చేసి పర్యవేక్షణ చేయాలనేది సర్కారు యోచన. ప్రతి ఒక్కరికీ ఎంత ఖరీదైన మందులైనా ప్రభుత్వమే ఉచితంగా ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. (చదవండి: అన్ని పథకాలకు అండగా నిలుస్తాం)

జిల్లాల వారీగా ఇప్పటికే సర్వే పూర్తయిన ఇళ్ల సంఖ్య

జిల్లా         పట్టణ ప్రాంతాల్లో సర్వే చేసిన ఇళ్లు      గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేసిన ఇళ్లు

విజయనగరం              22,594                               1,29,356

శ్రీకాకుళం                   4,929                                  91,816

విశాఖపట్నం               27,116                               2,01,737

తూర్పు గోదావరి           66,321                              3,11,412

పశ్చిమ గోదావరి           40,953                              2,07,383

కృష్ణా                          71,081                              2,10,787

గుంటూరు                    60,760                             1,44,198

ప్రకాశం                        6,034                               1,15,083

నెల్లూరు                      29,640                              1,24,161

చిత్తూరు                      59,232                             2,34,059

కర్నూలు                    16,828                              1,49,117

వైఎస్సార్‌                     41,554                             1,87,662

అనంతపురం                44,472                             2,22,656

ప్రాథమిక దశలోనే గుర్తించే వీలు
ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు సేకరించడమనేది మహాయజ్ఞం లాంటిది. దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్రమించే వివిధ వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి తక్షణ చికిత్స అందించే వెసులుబాటు కలుగుతుంది. ఏఎన్‌ఎంలు పక్కాగా వివరాలు సేకరిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో వివిధ జబ్బులతో బాధపడుతున్న వారిపై కచ్చితమైన అంచనా వస్తుంది. - అనిల్‌కుమార్‌ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ
 

మరిన్ని వార్తలు