అన్నీ పరిశీలించాకే రాజద్రోహం కేసు

21 May, 2021 09:56 IST|Sakshi

రఘురామకృష్ణరాజు పిటిషన్‌ కొట్టేయండి

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటరు దాఖలు 

నేడు విచారించనున్న జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ ధర్మాసనం  

సాక్షి, న్యూఢిల్లీ:  ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం గురువారం కౌంటర్‌ దాఖలు చేసింది. రాష్ట్రంలో పలు వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని పెంచేలా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని పేర్కొంది. రఘురామ ప్రసంగాలన్నీ పరిశీలించిన తర్వాతే రాజద్రోహం కేసు నమోదు చేసినట్లు తెలిపింది. పలు కేసుల్లో రాజద్రోహానికి సంబంధించి ఇదే కోర్టు బెయిలు నిరాకరించిందని తెలిపింది. హార్దిక్‌ భారతీభాయ్‌ పటేల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్, అఖిల్‌ గొగొయ్‌ వర్సెస్‌ నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, గౌతమ్‌ నవలఖా వర్సెస్‌ ఎన్‌ఐఏ, సుధా భరద్వాజ్‌ వర్సెస్‌ ఎన్‌ఐఏ వంటి కేసుల్లో కోర్టు ఆదేశాలు ఇచ్చిందని కౌంటర్‌లో పేర్కొంది.

హైకోర్టు కూడా ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని సూచించిన నేపథ్యంలో రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది. రఘురామ పిటిషన్‌లో మెరిట్స్‌ లేవని పేర్కొంది. రాష్ట్రంలో కులం, మతం ఆధారంగా అశాంతి సృష్టించడానికి పలువురు వ్యక్తులతో కలసి కుట్ర చేశారని, ఈ నేపథ్యంలో పిటిషనర్‌పై చర్యలు తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి వేరే మార్గం లేదని పేర్కొంది. భావ ప్రకటన స్వేచ్ఛలోనే శాంతి భద్రతలకు భంగం కలిగించరాదన్న విషయం అంతర్గతంగా ఉంటుందని, అలజడి సృష్టిస్తున్న వ్యక్తులపై పోలీసులు సుమోటో కేసు నమోదు చేయవచ్చని చెప్పింది.

జ్యుడిషియల్‌ కస్టడీలోనూ పిటిషనర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టడానికి వెనకాడలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టాలని చూశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. రాష్ట్రంలో అలజడి సృష్టించే కుట్రలో పిటిషనర్‌తో పాటు సహ కుట్రదారుల పాత్రనూ విచారించాల్సి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రఘురామను పోలీసు కస్టడీకి ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌లో పేర్కొంది. రఘురామ దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయగా.. ఎ.సుబ్బారాయుడు అనే వ్యక్తి ఇంప్లీడ్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు.

చదవండి: రఘురామకృష్ణరాజు కేసు: కొట్టారన్నది కట్టు కథే 
చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఇదంతా: మిథున్‌రెడ్డి

మరిన్ని వార్తలు