ఏపీ: నకిలీ, నాసిరకం మందుల నియంత్రణకు సరికొత్త విధానం

24 Aug, 2021 21:11 IST|Sakshi

నమూనాల సేకరణలో సరికొత్త ఐటీ విధానం

కంప్యూటర్‌ ఎయిడెడ్‌ సెలక్షన్‌ అప్లికేషన్‌ అమల్లోకి

నకిలీ, నాసిరకం మందుల నియంత్రణే లక్ష్యం 

త్వరలోనే కొత్త ఐటీ విధానాన్ని అమల్లోకి తేనున్న ఔషధ నియంత్రణ శాఖ 

సాక్షి, అమరావతి: నకిలీ, నాసిరకం మందుల నియంత్రణకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. మందుల అమ్మకాలు, నమూనాల సేకరణ, నమూనాల పరిశీలన వంటి వాటి విషయంలో ఐటీ ఆధారిత సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఔషధ నియంత్రణ శాఖ ప్రత్యేక ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి సంబంధించిన యాప్‌లను అందుబాటులోకి తెచ్చి రాష్ట్రంలో మందుల పరిశీలన విధానాన్ని సులభతరం చేయనుంది.

ఇకపై అలా ఉండదు.. 
రాష్ట్రంలో సుమారు 30 వేల వరకూ రిటైల్‌ మందుల షాపులు, 23 మాన్యుఫాక్చర్‌ సంస్థలు, 1,200కు పైగా హోల్‌సేల్‌ షాపులున్నాయి. మనకు వస్తున్న మందులు 90 శాతం ఇతర రాష్ట్రాలవే. ఇలా బయటి నుంచి వస్తున్న మందులు నాసిరకమా, నకిలీవా, జీఎంపీ(గుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రాక్టీస్‌) కలిగి ఉన్నాయా.. లేదా వంటివన్నీ పరిశీలించేందుకు ఐటీ ఆధారిత సేవలను వినియోగించుకుంటారు. కొత్తగా సీఏఎస్‌ఐ(కంప్యూటర్‌ ఎయిడెడ్‌ సెలక్షన్‌ ఆఫ్‌ ఇన్‌స్పెక్షన్‌), పాడ్స్‌(ప్రివెంటివ్‌ యాక్షన్‌ త్రూ డ్రగ్‌ సర్వైలెన్స్‌) అనే రెండు ఐటీ అప్లికేషన్లను ఔషధ నియంత్రణ శాఖ అమల్లోకి తెస్తోంది.
(చదవండి: వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌)

సీఏఎస్‌ఐ ప్రకారం.. ఎలాంటి మందులను పరిశీలించాలన్న దానిని మానవాధారిత ప్రమేయం లేకుండా ప్రత్యేక కంప్యూటర్‌ పరిజ్ఞానంతో ఎంపిక చేస్తారు. ఇప్పటి వరకూ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో ఏదో ఒక టాబ్లెట్‌ను ఎంపిక చేసుకుని నమూనాలు సేకరించేవారు. ఇకపై అలా ఉండదు. ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని ఇకపై డిజిటల్‌ రికార్డుల్లో నమోదు చేస్తారు. సీఏఎస్‌ఐ సాఫ్ట్‌వేర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు, అసిస్టెండ్‌ డైరెక్టర్లకు ప్రత్యేక లాగిన్, పాస్‌వర్డ్‌లు ఇస్తారు. మందుల నమూనాలను ఎలా ఎంపిక చేయాలన్న దానిపై ఔషధ నియంత్రణ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షణ ఉంటుంది. 

దేశంలోనే తొలిసారి..
ఇకపై ఇంటెలిజెంట్‌ శాంపిలింగ్‌ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. దేశంలోనే తొలిసారి మందుల నమూనాల సేకరణలో ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెడుతున్నారు. ఎక్కడో నాలుగు శాంపిళ్లు తీసుకురావడం, వాటిని పరీక్షించడం.. వంటి మూస పద్ధతికి స్వస్తి చెప్పి ఇంటెలిజెంట్‌ శాంపిలింగ్‌ చేస్తారు. అది ఎలా ఉంటుందంటే.. పదే పదే నాసిరకం అని తేలిన కంపెనీపై నిఘా ఉంచడం, మార్కెట్లో అతి తక్కువ రేటుకు అమ్మడం, లేదా రేటు ఎక్కువగా ఉండటం, లేబిలింగ్‌పై తేడాలు గమనించడం ఇలాంటి కొన్ని అనుమానాల నేపథ్యంలో వాటిని సేకరిస్తారు.

ముఖ్యంగా మాన్యుఫాక్చరర్స్, డీలర్స్, హోల్‌సేలర్స్‌ లావాదేవీలన్నీ ట్రేస్‌ అండ్‌ ట్రాక్‌ విధానంలో పెట్టడం వంటివి చేస్తారు. ప్రివెంటివ్‌ యాక్షన్‌ త్రూ డ్రగ్‌ సర్వైలెన్స్‌(పాడ్స్‌) ప్రకారం డీలర్, డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, రీటెయిలర్‌ ఇలా లైసెన్స్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఔషధ నియంత్రణ శాఖ లాగిన్, పాస్‌వర్డ్‌ ఇస్తుంది. దీన్ని ఔషధ నియంత్రణశాఖ పోర్టల్‌కు అనుసంధానిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మందుల కంపెనీల లైసెన్స్‌లను పరిశీలిస్తారు. లైసెన్స్‌లు, రెన్యువల్స్‌ పరిశీలనకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారి ఉంటారు. దీనివల్ల ఏ కంపెనీ లేదా స్టాకిస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే వీలుంటుంది.

మరిన్ని వార్తలు