కాలుష్య వాహనాలపై కొరడా!

10 Oct, 2020 03:22 IST|Sakshi

గ్రీన్‌ సెస్‌ విధించేందుకు ప్రభుత్వం నిర్ణయం

ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రవాణా శాఖకు ఆదేశం

సాక్షి, అమరావతి: కాలుష్య ఉద్గారాలు వెదజల్లే వాహనాలపై రాష్ట్ర రవాణా శాఖ కొరడా ఝుళిపించనుంది. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కాలుష్య వాహనాలకు భారీ జరిమానాలు విధించనుంది. కాలుష్య వాహనాలతో చర్మ క్యాన్సర్‌ లాంటి ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ వాహనాలు వెదజల్లే నైట్రోజన్, కార్బన్‌ మోనాక్సైడ్‌.. ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవడంతోపాటు శరీరంలోని ముఖ్య అవయవాలకు ఆక్సిజన్‌ అందకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో కాలం చెల్లిన వాహనాలను రోడ్లపైకి తిరగకుండా చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సెస్‌ విధించనుంది. ఈ మేరకు రవాణా శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. 

కేటగిరీలగా వాహనాల విభజన
మూడు కేటగిరీల కింద రవాణేతర వాహనాలను, నాలుగు కేటగిరీల కింద రవాణా వాహనాలను విభజించారు. రవాణేతర వాహనాల కింద ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను 15 ఏళ్ల లోపు, 15–20 ఏళ్లు, 20 ఏళ్లు పైబడినవాటిగా విడగొట్టారు. రవాణా వాహనాల విభాగంలో గూడ్స్, బస్సులను ఏడేళ్ల లోపు, 7–10 ఏళ్లు, 10–12 ఏళ్లు, 12 ఏళ్లకు పైబడిన వాహనాలుగా పేర్కొన్నారు. 15 ఏళ్ల లోపు, 15–20 ఏళ్ల కేటగిరీలో కాలుష్యం వెదజల్లే ద్విచక్ర వాహనాలకు ఏడాదికి రూ.2 వేలు, కార్లకు రూ.4 వేలు చొప్పున జరిమానా విధించనున్నారు. 20 ఏళ్లు పైబడిన వాహనాలకు భారీగా జరిమానాలు ఉంటాయి. గూడ్స్, బస్సులకు క్వార్టర్లీ పన్నుల విధానంలో అదనంగా పన్నులు విధించనున్నారు. ఈ జరిమానాలపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 

మరిన్ని వార్తలు