వేసవి సెలవులు: డిజిటల్‌ వేదికగా అందుబాటులో ఉపాధ్యాయులు 

1 May, 2021 08:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 ప్రభావంతో తీవ్రంగా నష్టపోయినవారిలో మొదటి వరుసలో పదోతరగతి విద్యార్థులు ఉంటారు. విద్యా సంవత్సరంలో సగం కరోనాతో పాఠశాలలు మూతపడ్డాయి. మిగతా సగం పూర్తవకముందే మరోసారి మహమ్మారి విరుచుకుపడటంతో ఉన్నపళంగా మే ఒకటో తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఆదమరిస్తే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదమున్నందున సెలవు రోజుల్లో విద్యార్థులు బడి లేదన్న భావనతో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా చదువుకుంటేనే మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారని ఉపాధ్యాయులు సలహా ఇస్తున్నారు. కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంటిపట్టునే ఉండి మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న 61,589 మంది విద్యార్థులు పరీక్షల రాయటానికి సిద్ధంగా ఉన్నారు. 

కీలకమైన నెలలో సెలవులు... 
గతేడాది సెప్టెంబర్‌లో 9, 10 తరగతుల విద్యార్థులకు సందేహాల నివృత్తి కోసం పాఠశాలలు తెరచినా డిసెంబర్‌ నుంచే పూర్తి స్థాయిలో తరగతిలో పాఠాలు చెప్పగలిగే అవకాశం వచ్చింది. కరోనా కారణంగా కొంత సమయం కోల్పోవడంతో ప్రభుత్వం విద్యా సంవత్సరాన్ని కొంతమేరకు పొడిగించింది. సాధారణంగా మార్చి మూడో వారంలో ప్రారంభం కావాల్సిన పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది జూన్‌ ఏడు నుంచి 16వ తేదీ మధ్య నిర్వహించడానికి షెడ్యూల్‌ విడుదల చేసింది. విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోవడానికి కీలకమైన ఆఖరి నెల రోజులు కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాల్సి రావడంతో వారి చదువుపై తీవ్రంగా ప్రభావం చూపనుంది. పబ్లిక్‌ పరీక్షల ముందు సన్నాహక పరీక్షలు, సబ్జెక్టుల వారీగా విశ్లేషణ చేసుకోవడం, సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిన సమయంలో సెలవులు విద్యార్థులకు ఇబ్బందికరమే అయినా దానిని సరైన ప్రణాళికతో అధిగమించాల్సిన అవసరముంది.  

అలసత్వం వహిస్తే అసలుకే మోసం.. 
వరుస సెలవులతో విద్యార్థుల్లో అలసత్వం, అశ్రద్ధ సహజంగానే ఏర్పడతాయి. సంవత్సరమంతా కష్టపడి చదివింది మర్చిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా పిల్లల్లో అలసత్వం వహించి అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. పరీక్షల సమయంలో సాధారణంగా విద్యార్థులు చదివిన పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకుంటూ ఉంటారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో అయితే ఉపాధ్యాయులు విద్యార్థులను రాత్రీపగలు పాఠశాలల్లోనే పుస్తకాలతో కుస్తీ పట్టిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులకు అలాంటి అవకాశం లేదు.  

డిజిటల్‌ వేదికగా అందుబాటులో ఉపాధ్యాయులు.. 
సెలవుల కారణంగా విద్యార్థులు చదువులో వెనుకబడకుండా ఉండేందుకు ఉపాధ్యాయులు వాట్సాప్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఫోన్‌లో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. నమూనా ప్రశ్నపత్రాలను తయారు చేసి వాట్సాప్‌ గ్రూపుల్లో విద్యార్థులకు చేరవేస్తున్నారు. పలు పాఠ్యాంశాలకు చెందిన వీడియోలను షేర్‌ చేస్తున్నారు. అనుమానాలను నివృత్తి చేయడానికి ఉపాధ్యాయులు ఫోన్‌లో రికార్డ్‌ చేసి పిల్లల మొబైల్‌కు పంపుతున్నారు. ఈ సదుపాయాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. సెలవులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే సబ్జెక్టుల వారీగా విద్యార్థులు పట్టు సాధించవచ్చని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. 

తల్లిదండ్రులు తగిన ఏర్పాట్లు చేయాలి... 
పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారికి బలవర్థకమైన ఆహారం అందిస్తూనే కోవిడ్‌ బారిన పడకుండా కనిపెట్టుకోవాలని పేర్కొంటున్నారు. సందేహాలు నివృత్తి చేసుకునేలా పిల్లలను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. 

ఫోన్‌లో నిత్యం అందుబాటులో... 
పదో తరగతి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు అలసత్వం ప్రదర్శిస్తే  ఫలితాలు తారుమారయ్యే ప్రమాదముంది. విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రోజులో కొంత సమయాన్ని కేటాయించేలా టైం టేబుల్‌ వేసుకుని రివిజన్‌ చేసుకోవాలి. ఉపా«ధ్యాయులందరం విద్యార్థులకు నిత్యం ఫోన్‌లో అందుబాటులో ఉంటున్నాం. వారికి సందేహం వస్తే ఫోన్‌ ద్వారా నివృత్తి చేస్తున్నాం. వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి మోడల్‌ పేపర్లు, చార్టులను షేర్‌ చేస్తున్నాం. 
– సీహెచ్‌ సుమతి, గణిత ఉపాధ్యాయురాలు, జెడ్పీ హైస్కూల్, దొనపూడి, కొల్లూరు మండలం 

సెలవులను సద్వినియోగం చేసుకోవాలి 
విద్యార్థులు కరోనా బారిన పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ఈ నెల రోజులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధ్యాయులు వాట్సాప్, ఫోన్‌ కాల్స్‌ ద్వారా నిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నారు. విద్యార్థులకు ఎంతో కీలకమైన ఈ నెలలో ఆలసత్వం వహిస్తే తీవ్రంగా నష్టపోతారు. జాగ్రత్తగా సబ్జెక్టుల వారీగా రివిజన్‌ చేసుకోవాలి. పిల్లలు చదువుకొనే వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలి. విద్యార్థులు ఇంటిపట్టునే ఉంటూ కరోనా బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. – ఆర్‌ఎస్‌ గంగాభవానీ, డీఈఓ

చదవండి: తిరుపతి ఉప ఎన్నికపై పిటిషన్ల కొట్టివేత

మరిన్ని వార్తలు