భూసేకరణ అవసరం లేకుండా..

20 Oct, 2020 18:34 IST|Sakshi

రాయలసీమ ఎత్తిపోతల అలైన్‌మెంట్‌ను రూపొందించిన ప్రభుత్వం

ఇప్పటికే పలు ప్రాజెక్టుల వల్ల ముచ్చుమర్రి పరిసర గ్రామాల్లో భూములు కోల్పోయిన రైతులు

ఉన్న భూములు తీసుకుంటే రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని సర్కార్‌కు అధికారుల నివేదన

దాంతో ఒక్క ఎకరా భూసేకరణ చేయాల్సిన అవసరం లేకుండా అలైన్‌మెంట్‌ మార్పు

సంగమేశ్వరం నుంచి పోతిరెడ్డిపాడు వరకు భవనాశి నదిలో కాలువ తవ్వకం

పోతిరెడ్డిపాడు వద్ద జలవనరుల శాఖ అధీనంలోని భూమిలో పంప్‌ హౌస్ నిర్మాణం

దీని వల్ల భూసేకరణ వ్యయం రూ. 854 కోట్లు ఆదా

సాక్షి, అమరావతి: ఒక్క ఎకరా కూడా సేకరించాల్సిన అవసరం లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసేలా ప్రభుత్వం అలైన్‌మెంట్‌ను రూపొందించింది. శ్రీశైలం ప్రాజెక్టులో సంగమేశ్వరం (800 అడుగుల నీటి మట్టం) నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ (పీహెచ్‌ఆర్‌) వరకూ మూడు టీఎంసీలను తరలించే సామర్థ్యంతో భవనాశి నదిలో  17 కి.మీ.లు కాలువ తవ్వి.. అక్కడి నుంచి పీహెచ్‌ఆర్‌ దిగువన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా పంప్‌ హౌస్‌ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. భవనాశి నదిలో కాలువ తవ్వడం వల్ల భూసేకరణ అవసరం ఉండదు. ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ) పనులు చేసే సమయంలో పీహెచ్‌ఆర్‌ వద్ద అదనంగా 123 ఎకరాల భూమిని సర్కార్‌ అప్పట్లోనే సేకరించింది. ఆ భూమిలో పంప్‌ హౌస్, 400 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను నిర్మించాలని నిర్ణయించింది. తద్వారా రాయలసీమ ఎత్తిపోతల పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించింది. దీనివల్ల భూసేకరణకు వ్యయమయ్యే రూ. 854 కోట్లు ఆదా అవుతాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పీహెచ్‌ఆర్‌ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తాగు, సాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులను రూ. 3,307.07 కోట్లకు ఎస్పీఎమ్మెల్‌(జేవీ) సంస్థకు సర్కార్‌ ఇప్పటికే అప్పగించిన విషయం విదితమే. 

రైతుల జీవనోపాధి దెబ్బతినకుండా..

  • కృష్ణా నదిలో తుంగభద్ర కలిసే ప్రాంతమైన సంగమేశ్వరం వద్ద శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల్లో నీరు నిల్వ ఉంటుంది. సంగమేశ్వరం నుంచి ముచ్చుమర్రి వరకూ జలాశయంలో 4.5 కి.మీ.ల పొడవున తవ్వే అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా మూడు టీఎంసీలు (34,722 క్యూసెక్కులు) తరలించి.. అక్కడి నుంచి ఒక్కో పంప్‌ 81.93 క్యూమెక్కులు (2,893 క్యూసెక్కులు) చొప్పున 12 పంప్‌ల ద్వారా 34,722 క్యూసెక్కులను 39.60 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసేలా పంప్‌ హౌస్‌ను నిర్మించాలని తొలుత నిర్ణయించారు. ముచ్చుమర్రి వద్ద నిర్మించే హౌస్‌ ద్వారా ఎత్తిపోసిన నీటిని 125 మీటర్ల పొడవున ఏర్పాటు చేసే పైపులైన్‌ ద్వారా తరలించి.. డెలివరీ సిస్ట్రన్‌లో పోసి.. అక్కడి నుంచి 22 కి.మీ.ల పొడవున కాలువ తవ్వి.. పీహెచ్‌ఆర్‌కు దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో 4 కి.మీ. వద్దకు పోయాలని తొలుత నిర్ణయించారు. 
  • అయితే జలాశయంలో బంకమట్టి పేరుకుపోయింది. దీనివల్ల అప్రోచ్‌ కెనాల్‌ను తవ్వడం ఇబ్బంది అవుతుంది. 
  • ముచ్చుమర్రి వద్ద పంప్‌ హౌస్, పైపులైన్, డెలివరీ సిస్ట్రన్‌ నిర్మాణం, 22 కి.మీ.ల పొడవున కాలువ తవ్వకం కోసం 1,200 ఎకరాల భూమిని సేకరించాలి. 
  • ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పనులు చేపట్టినప్పుడు ముచ్చుమర్రి పరిసర గ్రామాల్లోనే భూసేకరణ చేయాల్సి వచ్చింది. దీనివల్ల ప్రస్తుతం రైతుల చేతిలో అతి తక్కువ భూమి మాత్రమే మిగిలింది. మిగిలిన భూమిని కూడా సేకరిస్తే రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
  • భవనాశి నదిలో అప్రోచ్‌ కెనాల్‌, పీహెచ్‌ఆర్‌ వద్ద జలవనరుల శాఖ అధీనంలో ఉన్న 123 ఎకరాల్లో పంప్‌ హౌస్‌ నిర్మాణంతో ఒక్క ఎకరా భూమిని సేకరించాల్సిన అవసరం ఉండదని, ఆ వ్యయం ఆదా అవుతుందని నివేదించారు. ఉభయతారకంగా ఉన్న ఈ ప్రతిపాదనపై సర్కార్‌ ఆమోదముద్ర వేసింది.

శరవేగంగా పూర్తి చేస్తాం..: సి.నారాయణరెడ్డి, ఈఎన్‌సీ, జలవనరుల శాఖ.
శ్రీశైలం ప్రాజెక్టులో సంగమేశ్వరం నుంచి ముచ్చుమర్రి వరకూ బురద పేరుకుపోయి.. ఆ ప్రాంతమంతా ఊబిలా మారింది. అప్రోచ్‌ కెనాల్‌ను 800 అడుగుల మట్టంలో తవ్వడం వ్యయప్రయాసలతో కూడుకుంది. ముచ్చుమర్రి నుంచి పీహెచ్‌ఆర్‌ వరకూ 22 కి.మీ.ల కెనాల్‌ తవ్వాలంటే 1,200 ఎకరాల భూమిని సేకరించాలి. ఒక్క ఎకరా భూమిని సేకరించాల్సిన అవసరం లేకుండానే రాయలసీమ ఎత్తిపోతలను పూర్తి చేసేలా అలైన్‌మెంట్‌ను రూపొందించాం. ఈ అలైన్‌మెంట్‌ ప్రకారం గడువులోగానే పనులు పూర్తి చేస్తాం.


భవనాశి నది మార్గంలోనే..: మురళీనాథ్‌రెడ్డి, సీఈ, కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్‌.
నల్లమల అడువుల్లో జన్మించే భవనాశి నది పీహెచ్‌ఆర్‌కు దిగువన సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఆ నది ప్రవాహం వల్ల సంగమేశ్వరం నుంచి పీహెచ్‌ఆర్‌ వరకూ బురద పేరుకోలేదు. ఈ నదిలో పీహెచ్‌ఆర్‌ వరకూ 17 కి.మీ.ల పొడవున అప్రోచ్‌ కెనాల్‌ తవ్వడం ద్వారా 800 అడుగుల నుంచే నీటిని తరలించవచ్చు. పీహెచ్‌ఆర్‌ వద్ద అందుబాటులో ఉన్న 123 ఎకరాల్లో పంప్‌ హౌస్, సబ్‌ స్టేషన్‌ను నిర్మించి పనులు పూర్తి చేస్తాం.

మరిన్ని వార్తలు