వివక్ష లేదు.. లంచాలకు తావులేదు: సీఎం జగన్‌

28 Dec, 2021 11:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి మంగళవారం ఆయన నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని.. 9,30,809 మందికి వారి ఖాతాల్లో రూ. 703 కోట్లను జమచేస్తున్నామని తెలిపారు.

చదవండి: 2021 రివైండ్‌: టీడీపీకి పరాభవ ‘నామం’

‘‘గతంలో పథకాలకోసం ప్రజలు ఎదురుచూసేవారు. ఇప్పుడు ప్రజలనే నేరుగా వెతుక్కుంటూ పథకాలు వస్తున్నాయి. ఈ పథకాలు అమలు చేసేటప్పుడు మనం కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడ్డం లేదు. అర్హత ఉంటే చాలు, సంక్షేమ పథకాలు అందరికీ దక్కుతాయన్న కోణంలోనే ప్రతి అడుగూ వేస్తున్నాం. ఇంకా ఎక్కడైనా అర్హులైన ఉండి కూడా దరఖాస్తు చేసుకోలేకపోవడమో, అర్హత నిర్ధారణలో జరిగిన పొరపాట్లవలనో, నిర్ణీత సమయంలోగా దరఖాస్తు చేసుకోకపోవడంవల్లో, బ్యాంకు ఖాతాలు సరిగ్గా లేపోవడం వల్లో ఇలా ఏ కారణాలు అయినా సరే అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందనట్టు అయితే అటువంటి వారు అందరూ కూడా మిస్‌కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామని’’  సీఎం పేర్కొన్నారు.

ఇది గొప్ప విప్లవాత్మక మార్పు:
‘‘గతంలో ప్రభుత్వాలు.. ఎలా కత్తిరించాలి.. అనిఆలోచించేవి. ఎవరూ మిగిలిపోకూడదు, అర్హులకు అందరికీ అందలాన్న తపన, తాపత్రయం ఈ ప్రభుత్వంలో ఉంది. దేశంలో తొలిసారిగా మిస్‌ అయిన వారికి కూడా ఒక అవకాశం ఇచ్చి, వారికి కూడా నెలరోజుల్లోపు దరఖాస్తులు చేసుకోమని చెప్పి, పరిశీలనలు చేసి వారిక్కూడా రావాల్సిన డబ్బును అందిస్తున్నాం. పెన్షన్‌లు, రేషన్‌కార్డులు, ఇతర పథకాల లబ్ధిదారులను తీసుకున్నా.. గత ప్రభుత్వంతో కంటే లబ్ధిదారుల సంఖ్యలో కాని, వారికి ఇస్తున్న మొత్తంలోగాని విపరీతమైన మార్పు ఉంది.

విప్లవాత్మకంగా ఈ మార్పునకు శ్రీకారం చుట్టడం జరిగింది. టీడీపీ హయాంలో పెన్షన్ల రూపంలో ఎన్నికలకు 2 నెలలముందు వరకూ కేవలం రూ.1000లు మాత్రమే ఇచ్చేవారు. అది కూడా ఎన్నికలకు 6 నెలలకు ముందు వరకూ కేవలం 39 లక్షలమందికి, నెలకు రూ.400 కోట్లు ఇచ్చేవారు. ఇవాళ 61లక్షల పెన్షన్లకు పెంచాం. పెన్షన్‌ను రూ.2250లకు పెంచాం. రూ.1450 కోట్లు నెలకు కేవలం పెన్షన్లకోసమే ఖర్చు చేస్తున్నాం. ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని తెల్లవారుజామునే వాలంటీర్‌ వచ్చి గుడ్‌మార్నింగ్‌చెప్పి.. చేతిలో పెన్షన్‌ పెట్టబోతున్నారు.  ఈ ఒకటో తారీఖు నుంచి రూ.2500కు పెంచబోతున్నాం.

గతంలో పథకాలను ఎగ్గొట్టేందుకు, లంచాలు గుంజేందుకు జన్మభూమి కమిటీలు పెడితే... గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి సోషల్‌ఆడిట్‌ ద్వారా అర్హులందరికీ న్యాయం ఇవాళ న్యాయం జరుగుతుంది. గతంలో ఆత్మాభిమానం చంపుకుని వృద్ధులు, వికలాంగులు పెన్షన్లకోసం తిరిగే వారు. వివక్ష లేకుండా, లంచాలకు తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తున్నాం. కోవిడ్‌ వల్ల ప్రభుత్వ రాబడి తగ్గినా, ఖర్చులు పెరిగినా పేదలకు అండదండలు అందించేందుకు మన ప్రభుత్వం అడుగులు ముందుకేసిందని’’ సీఎం అన్నారు.

వివిధ పథకాల్లో మిస్‌ అయిన వారికి ఇవాళ ఇస్తున్న ప్రయోజనాలు ఇవీ:
వైఎస్సార్‌  చేయూత కింద 2,50,929 మందికి రూ. 470.40 కోట్లు ఇవాళ అందిస్తున్నాం
వైఎస్సార్‌ ఆసరా కింద 1,136 మందికి రూ. 7.67 కోట్లు ఇస్తున్నాం
వైఎస్సార్‌ సున్నావడ్డీ కింద మహిళలకు 59,661 మందికి రూ. 53,51కోట్లు అందిస్తున్నాం
వైఎస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాలు కింద 2019–20 ఏడాది కింద 62,622 మందికి రూ. 9.01కోట్లు, ఖరీఫ్‌ 2020 కింద  58,821 మందికి  10.06 కోట్లు ఇస్తున్నాం
వైఎస్సార్‌ రైతు భరోకకింద 2,86,059 మందికి రూ. 58.89 కోట్లు ఇస్తున్నాం
జగనన్న విద్యా దీవెన కింద 31,940 మందికి రూ.19.92 కోట్లు ఇస్తున్నాం
వైఎస్సార్‌ వసతి దీవెన కింద  43,010 మందికి రూ. 39.82 కోట్లు ఇస్తున్నాం
వైఎస్సార్‌ కాపు నేస్తం కింద 12,983 మందికి రూ.19.47 కోట్లు ఇస్తున్నాం
వైఎస్సార్‌ వాహన మిత్ర కింద 8,080 మందికి రూ.8.09 కోట్లు ఇస్తున్నాం
వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద 3,788 మందికి రూ. 3,79 కోట్లు ఇస్తున్నాం
వైఎస్సార్‌ నేతన్న నేతన్న నేస్తం కింద 794 మందికి రూ.1.91 కోట్లు అందిస్తున్నాం
ఇవికాక 90 రోజుల్లో ఇళ్లపట్టాలు 1,10,986 కు ఇస్తున్నాం

ఇవికాకుండా 1,51,562 లక్షల మందికి పెన్షన్‌కార్డులు ఇస్తున్నాం, ఏప్రిల్‌ 2021 నుంచి ఇచ్చిన పెన్షన్‌కార్డులు కలుపుకుంటే 4,96,059 మందికి పెన్షన్‌కార్డులు ఇచ్చాం. బియ్యంకార్డులు 3,07,599 మందికి ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ కార్డులు 1,14,129 మందికి ఇస్తున్నాం. డిసెంబర్‌ నుంచి మే వరకూ అమలైన పథకాల్లో అర్హత ఉండి మిస్‌ అయిన వారికి జూన్‌ లోనూ,  అలాగే జూన్‌ నుంచి నవంబర్‌ వరకూ అమలైన పథకాల్లో మిస్‌ అయిన వారికి డిసెంబర్‌లోనూ అందించే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు