బాలల కోసం బహువిధ రక్షణ

13 Mar, 2021 04:24 IST|Sakshi

వీధి బాలల సంరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సర్కారు కృషి

రాష్ట్రంలో 10,451 రక్షణ కమిటీలు

సాక్షి, అమరావతి: వీధి బాలల రక్షణ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ పథకం (ఐసీపీఎస్‌)కింద వివిధ రూపాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందుకోసం గ్రామ, మండల, పట్టణ, రైల్వే స్టేషన్‌ స్థాయిల్లో 10,541 రక్షణ కమిటీలను నియమించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 7,201 బాల్య వివాహాలను నివారించింది. పోక్సో చట్టం కింద నమోదైన 6,038 లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు రక్షణ కల్పించింది. 13,703 మంది బాల కార్మికులకు పని నుంచి విముక్తి కల్పించింది.

తల్లిదండ్రులు, సంరక్షకులు లేని బాలలను హోమ్స్‌కు తరలించి వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వమే చేపట్టింది. 3,793 మంది యాచించే పిల్లలను గుర్తించి వారి రక్షణ కోసం చర్యలు చేపట్టింది. హెచ్‌ఐవీ, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలున్న 843 మంది పిల్లల్ని గుర్తించి సహకారం అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. రాష్ట్రంలో 14 శిశు గృహ కేంద్రాలు ఉండగా.. వాటిలో 127 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వ సంరక్షణలో ఉన్న అనాథ పిల్లల్లో 675 మంది పిల్లలను వారి సంరక్షణ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకొచ్చే కుటుంబాలకు దత్తత ఇవ్వబోతోంది.

పిల్లల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు
చదువు అనేది పిల్లల ప్రాథమిక హక్కు. ఆ హక్కుకు భంగం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించినా శిక్షార్హులవుతారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నాం. అనాథ పిల్లలు ఎక్కడ దొరికినా శిశు గృహ కేంద్రాలకు తరలించి ప్రభుత్వమే వారి ఆలనా, పాలనా చూస్తోంది.    
– కృతికా శుక్లా, డైరెక్టర్, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ  

>
మరిన్ని వార్తలు