ఎంఎస్‌ఎంఈ ప్రణాళికపై ఏపీ ప్రభుత్వం కసరత్తు

16 May, 2022 08:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

17న మంగళగిరిలో పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో సమావేశం

సాక్షి, అమరావతి: రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో లక్ష సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) యూనిట్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సర ప్రణాళికపై దృష్టి సారించింది. ఇందుకోసం ఎంఎస్‌ఎంఈ 2022–23 పేరుతో ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవన్‌ పలు దేశాలు, రాష్ట్రాలు పర్యటించి అక్కడ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించారు.
చదవండి: అంగన్‌వాడీ వర్కర్లకు గుడ్‌న్యూస్‌.. ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు

అలాగే రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక సంఘాల నుంచి సూచనలు స్వీకరించేందుకు కూడా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యాలయంలో 17వ తేదీన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 20కి పైగా సంఘాల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎంఎస్‌ఎంఈ యాక్షన్‌ ప్లాన్‌లో తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించనున్నారు. దీనికి సంబంధించి ప్రతి జిల్లా నుంచి కార్యాచరణ ప్రణాళికను పరిశ్రమల శాఖ సేకరించింది.  

మరిన్ని వార్తలు