ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ పొడిగింపు

19 Jan, 2021 19:48 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: నిఘా పరికరాల కొనుగోళ్ల అక్రమాల వ్యవహారంలో వేటుకు గురైన ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల పాటు సస్పెన్షన్‌ను పొడగిస్తున్నట్లు తెలిపింది. ఆగష్టు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా డ్రోన్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. (చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు చేదు అనుభవం)

ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్‌పై గతంలో స్టే ఇచ్చింది. అయితే డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన ఏబీని సస్పెండ్‌ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో(క్యాట్‌) ఇదివరకే స్పష్టం చేయడం సహా, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును ఇవ్వగా.. దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ క్రమంలో ఏబీ సస్పెన్షన్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు