రాష్ట్రంలో నెలాఖరు వరకు రాత్రి కర్ఫ్యూ

13 Oct, 2021 19:23 IST|Sakshi

థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం  

సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు రాత్రి కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాలు, ఫిక్స్‌డ్‌ సీటింగ్‌ వేదికలలో ప్రత్యామ్నాయ సీట్లను ఖాళీగా వదలాలనే నిబంధనను తొలగించింది. దీంతో థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం లభించింది.

కోవిడ్‌ నిబంధనలపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివాహాలు, మతపరమైన సమావేశాలు సహా ఇతర అన్ని సభలు, సమావేశాల్లో గరిష్టంగా 250 మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతిచ్చారు.

మాస్కులు ధరించడం, తరుచూ చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.   

చదవండి: ఉద్యోగుల భద్రతలో సీఎం రెండడుగుల ముందే ఉంటారు: సజ్జల

మరిన్ని వార్తలు