ఆ కేసు విచారణ నుంచి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ తప్పుకోవాలి

16 Dec, 2020 05:05 IST|Sakshi

ఆస్తుల వేలం వ్యాజ్యాలపై 17న విచారణ  

కేసు విచారించడానికి ముందే మీరు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు 

రాజ్యాంగం వైఫల్యం చెందిందన్న మీ వ్యాఖ్యలు అవసరం లేనివి 

ఈ వ్యాఖ్యలే మీరు పక్షపాతంతో వ్యవహరిస్తారనేందుకు నిదర్శనం 

హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: మిషన్‌ బిల్డ్‌ ఆంధ్ర ప్రదేశ్‌లో భాగంగా సర్కారు ఆస్తులను వేలం ద్వారా విక్రయించేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖ లైన వ్యాజ్యాల్లో విచారణ నుంచి తప్పు కోవాలని న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ను అభ్యర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలను విచారించే ధర్మాసనంలో జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ సభ్యుడిగా కొనసాగితే, తాము న్యాయం పొందే అవకాశం ఉండదని హైకోర్టుకు తెలిపింది. పక్షపాతంతో వ్యవ హరించేందుకు ఆస్కారం ఉందని సహేతుక ఆందోళన ఉన్నప్పుడు, కేసు విచారణ నుంచి తప్పుకోండని కోరవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం తన అఫి డవిట్‌లో ప్రస్తావించింది.

కేసును పూర్తిగా విచారించడానికి ముందే ఓ నిర్ణయానికి వచ్చేసి ప్రభుత్వంపై ఆ న్యాయమూర్తి చేస్తున్న వ్యాఖ్యలే ఆయన పక్షపాతంతో వ్యవహరి స్తారనేందుకు నిదర్శనమని పేర్కొంది. విశాఖపట్నం, గుంటూరు తదితర జిల్లాల్లో ఆస్తుల వేలం నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై ఈ నెల 11న న్యాయ మూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ దొనడి రమేశ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ప్రభుత్వంపై పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తదుపరి ఈ నెల 17న గురువారం ఈ వ్యాజ్యాలు విచారణకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున మిషన్‌ ఆఫ్‌ ఏపీ స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మంగళ వారం ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.

అనవసర వ్యాఖ్యలవి..
► వినియోగంలో లేని, ఆక్రమణలో ఉన్న, వివాదాల్లో చిక్కుకున్న తదితర ఆస్తులను వేలం ద్వారా విక్రయించే అధికారం ప్రభుత్వానికి ఉందా? లేదా? అన్న అంశంపైనే కోర్టు తేల్చాల్సి ఉంది. ఈ అంశంపై హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిర్ణయం వెలువరిస్తే, ఆ నిర్ణయంపై అభ్యంతరం ఉన్న వాళ్లు తగిన రాజ్యాంగ వేదికను ఆశ్రయిం చేందుకు ప్రత్యామ్నాయం ఉంది. అలా కాకుండా రాష్ట్రంలో రాజ్యాంగం వైఫ ల్యం చెందిందని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం అవ సరం లేనివి. ఈ నేపథ్యంలో ఆయన ఈ కేసును విచారించడమంటే, న్యాయానికి విఘాతం కలిగినట్లే. 
► కోర్టులో ఆయన వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా,పత్రికల ద్వారా అవి దావానలంలా వ్యాపించాయి.   
► ‘కోర్టులో జరిగే కేసుల విచారణ ప్రొసీ డింగ్స్‌ను గమనించేందుకు వీలుగా హై  కోర్టు వెబ్‌సైట్‌లో ఆయా కోర్టు లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉన్నాయి. నేను ఈ కేసు (ఆస్తుల వేలం) విచారణను గమని స్తుండగా, న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ఈ నెల 11న చేసిన వ్యాఖ్యలను విన్నాను. ఆ వ్యాఖ్యలను కొన్ని పత్రికలు యథాతథంగా ప్రచురించాయి. వాటిని పరిశీలన నిమిత్తం కోర్టు ముందుంచుతున్నా’ అని ప్రవీణ్‌కుమార్‌  అఫిడవిట్‌లో వివరించారు. 

మరిన్ని వార్తలు