AP: సర్కారు వారి పెళ్లికానుక.. అర్హతలు ఇవే.. దరఖాస్తు చేయడం ఇలా.. 

11 Jan, 2023 18:36 IST|Sakshi

రాజమహేంద్రవరం రూరల్‌ (తూర్పుగోదావరి జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన యువతుల వివాహాలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీతోఫా ద్వారా ఆర్థిక సహాయం అందజేసేందుకు చర్యలు చేపట్టింది. వైఎస్సార్‌ కల్యాణమస్తు పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, భవన, ఇతర నిర్మాణ రంగాల్లో నమోదైన కార్మికులకు లబ్ధి చేకూరుస్తారు.

షాదీతోఫా పథకం ద్వారా ముస్లిం మైనార్టీలకు మేలు కలుగుతుంది. ఈ మేరకు గత ఏడాది అక్టోబర్‌ 1 తేదీ నుంచి గ్రామ సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఇప్పటి వరకూ జిల్లాలో 32 దరఖాస్తులు అందాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నారు. అన్ని స్థాయిల్లోనూ సమగ్ర పరిశీలన పూర్తయ్యాక అధికారిక ఆమోదం కోసం కలెక్టర్‌కు ఈ దరఖాస్తులు పంపుతారు.

దరఖాస్తు చేయడం ఇలా.. 
వివాహం జరిగిన 60 రోజుల్లోగా ఆయా గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకోవాలి. తొలుత సచివాలయాల ద్వారా వివాహ సర్టిఫికెట్‌ పొందాలి. అనంతరం నిబంధనల మేరకు వివాహ ధ్రువపత్రాలను దరఖాస్తులో పొందుపర్చాలి. ముఖ్యంగా పెళ్లిపత్రిక, పెళ్లి సమయంలో తీయించిన ఫొటోలు, మ్యారేజ్‌ సర్టిఫికెట్, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పాటు పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతా జిరాక్స్‌ సమర్పించాలి. వధూవరుల చదువుకు సంబంధించి పదో తరగతి ఉత్తీర్ణత సరి్టఫికెట్ల జిరాక్సు కూడా దరఖాస్తుకు జత చేయాలి. భవన నిర్మాణ కార్మికులు సభ్యత్వ ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాలి. ఈ పథకాలపై వైఎస్సార్‌ క్రాంతిపథం సిబ్బంది తమ పరిధిలోని సంఘాల సభ్యుల ద్వారా ఇప్పటికే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

అర్హతలు ఇవే... 
వివాహమయ్యేనాటికి వరుడికి 21, వధువుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
భర్త చనిపోయిన స్త్రీ రెండో పెళ్లి చేసుకున్నా అర్హురాలే 
వధూవరులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
కుటుంబ ఆదాయం నెలకు పల్లెల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలకు మించకూడదు
భూమి పల్లం 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు లేదా రెండూ కలిపి 10 ఎకరాలు మించకూడదు
కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్‌దారు అయ్యి ఉండకూడదు
పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది
కారు ఉండరాదు. ఆటో, ట్రాక్టర్, ట్యాక్సీకి మినహాయింపు ఉంది
కుటుంబం నెలవారీ విద్యుత్‌ వాడకం 300 యూనిట్లు మించరాదు
మున్సిపల్‌ ప్రాంతంలో 1000 ఎస్‌ఎఫ్‌టీకి మించి నివాస స్థలం ఉండరాదు

మరిన్ని వార్తలు