టోల్‌ ఫ్రీతో మోసాలకు చెక్‌!

9 Nov, 2020 19:16 IST|Sakshi

వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులపై కేసులు

అపరాధ రుసుం కింద రూ.13.14 కోట్లు వసూలు

సాక్షి, అమరావతి : వ్యాపారుల మోసాలపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004254202 వినియోగదారులకు ఊరట కలిగిస్తోంది. తూకాల్లో తేడా వచ్చినట్లు గుర్తించినా, నాసిరకం వస్తువులు ఇస్తున్నట్లు తెలిసినా, ధరల్లో తేడా ఉన్నట్లు అనుమానం వచ్చినా వినియోగదారులు వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 10,041 కాల్స్‌ వచ్చాయి. వీటి ఆధారంగా తూనికలు, కొలతల శాఖ అధికారులు కొందరిపై కేసులు నమోదు చేశారు.

అలాగే మరికొందరి నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు రూ.13.14 కోట్ల అపరాధ రుసుం వసూలు చేశారు. ఎమ్మార్పీ కాకుండా ఎక్కువకు విక్రయించడం, ధరల పట్టిక షాపుల్లో అందుబాటులో ఉంచకపోవడం తదితర వాటికి సంబంధించి అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. తూనిక యంత్రాలకు సంబంధించి ప్రమాణాలు పాటించని వారిపైనా కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా ఉచిత సరుకుల పంపిణీకి సంబంధించి కొందరు రేషన్‌ డీలర్లు సరైన తూకం ఇవ్వకుండా మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో వారిపై కూడా చర్యలు తీసుకున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఒక్కో వస్తువుకు ఒక్కోసారి బయోమెట్రిక్‌ తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు.

ఇటు ప్రజా పంపిణీ వ్యవస్థలో గానీ లేదా బయట వ్యాపారస్తులు గానీ మోసం చేస్తే తప్పనిసరిగా టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎం.కాంతారావు వినియోగదారులకు సూచించారు. లైసెన్స్‌ లేకుండా ఎవరైనా తూనిక యంత్రాలను రిపేరు చేస్తే వ్యాపారులతో పాటు రిపేరు చేసిన వ్యక్తిపైనా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌ పంపులకు సంబంధించి యంత్రాలను రిపేర్‌ చేసేందుకు రాష్ట్రంలో 727 మందికి మాత్రమే లైసెన్స్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వ్యాపారుల నుంచి అపరాధ రుసుం రూపంలో జిల్లాల వారీగా వసూలు చేసిన మొత్తం...
 

జిల్లా అపరాధ రుసుంగా వసూలు చేసిన మొత్తం(రూపాయల్లో
విశాఖపట్నం 1,72,75,407
తూర్పు గోదావరి 1,61,06,135
కృష్ణా 1,50,99,741
గుంటూరు     1,34,18,585
చిత్తూరు     97,16,560
పశ్చిమ గోదావరి 96,58,665
అనంతపురం 95,94,610
ప్రకాశం 85,57,380
నెల్లూరు 74,11,975
కర్నూలు 69,22,750
వైఎస్సార్‌ 59,13,185
శ్రీకాకుళం 54,81,220
విజయనగరం 49,00,300
రాష్ట్ర స్థాయి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 14,22,000
మొత్తం 13,14,78,513

మరిన్ని వార్తలు