ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

31 May, 2021 13:46 IST|Sakshi

అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

పీ,ఎల్‌, ఎఫ్‌ రకం మందులకు అనుమతి

కంట్లో చుక్కల మందుకు దక్కని పర్మిషన్‌

సీసీఆర్‌ఏఎస్‌  నివేదిక ఆధారంగా ప్రభుత్వ నిర్ణయం

అమరావతి: ఎట్టకేలకు ఆనందయ్య మందుకు అడ్డంకులు తొలగిపోయాయి.  కరోనా రోగులకు ఆనందయ్య మందు ఇవ్వవచ్చంటూ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ఆధారంగా  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అనుమతి
ఆనందయ్య ఇ‍చ్చే పీ, ఎల్‌, ఎఫ్‌ మందులను రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే కంట్లో వేసే ‘కే’ రకం మందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కే మందుకు సంబంధించి విచారణ రిపోర్టు రానందున, ప్రస్తుతం ఈ మందుకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. కంట్లో వేసే చుక్కల మందుకు సంబంధించి నివేదిక రావడానికి మరో రెండు నుంచి మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ నివేదిక పరీశీలించిన అనంతరం కే రకం మందుపై నిర్ణయం తీసుకోనున్నారు.

వ్యక్తిగత విచక్షణ
కరోనాకు డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే.. వ్యక్తిగత విచక్షణ మేరకు ఆనందయ్య మందును వాడుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చింది. ఆనందయ్య మందులు వాడుతున్నామనే కారణంతో మిగిలిన మందులు ఆపవద్దంటూ ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే అనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనేందుకు కచ్చితమైన ఆధారాలు ఏవీ లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆనందయ్య మందుల వల్ల హాని కూడా లేదని తేలింది.

రోగులు రావొద్దు
ఆనందయ్య మందును తీసుకునేందుకు కొవిడ్‌ రోగులు కృష్ణపట్నం రావొద్దని ప్రభుత్వం సూచించింది. రోగుల బదులు వారి కుటుంబ సభ్యులు వచ్చి మందును తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసింది. ఇలా చేయడం వల్ల కరోనా వ్యాప్తిని నివారించవచ్చని సూచించింది.  ఆనందయ్య మందు పంపిణీలో కోవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలంటూ ఆదేశించింది. 

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు