ఏపీ: సెరీ కల్చర్‌ అభివృద్ధికి సర్కారు చర్యలు 

9 Jul, 2021 15:25 IST|Sakshi

తెల్ల పట్టుగూళ్లకు కిలోకు రూ.50 ఇన్సెంటివ్‌ 

మల్బరీ మొక్కలు పెంచే రైతులకు ఎకరాకు రూ.10,500, షెడ్‌కు రూ.3 లక్షల ప్రోత్సాహం

పరికరాలకు రూ.57,500, మందుల కోసం రూ.3,750 చొప్పున అందజేత 

రాష్ట్రంలో 1,19,050 ఎకరాల్లో మల్బరీ సాగు

ఈ ఏడాది మరో 10 వేల ఎకరాల విస్తీర్ణం పెరిగేలా చర్యలు

రెండేళ్లలో మూడు పట్టు పరిశ్రమల రాక

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టు పురుగుల పెంపకాన్ని (సెరీకల్చర్‌) మరింతగా విస్తరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో 7,500 ఎకరాల్లో టస్సార్‌ పట్టు పురుగుల పెంపకం ద్వారా మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా.. మల్బరీ పట్టు పురుగుల పెంపకంలో రెండో స్థానంలో ఉంది. ముడి పట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. తద్వారా మన రాష్ట్రానికి బెస్ట్‌ బైవోల్టైస్‌ సెరీకల్చర్‌ ప్రాక్టీసింగ్‌ స్టేట్‌ ఇన్‌ ఇండియా అవార్డు లభించింది. 

మల్బరీ విస్తరణకు ప్రోత్సాహకాలు 
రాష్ట్రంలో 1,19,050 ఎకరాల్లో 68,921 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. అత్యధికంగా అనంతపురంలో 48,922 ఎకరాలు, చిత్తూరులో 46,400 ఎకరాల్లో మల్బరీ సాగవుతోంది. తూర్పు ఏజెన్సీ పరిధిలోని 7,500 ఎకరాల్లో టస్సార్‌ సాగు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 59,079 టన్నుల పట్టుగూళ్లు, 8,420 టన్నుల ముడిపట్టు ఉత్పత్తి అవుతోంది. పట్టు పరిశ్రమపై ఆధారపడి 13.09 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,053.70 కోట్ల స్థూల విలువ సాధించిన పట్టు పరిశ్రమను మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వం సంకల్పించింది. గడచిన రెండేళ్లలో 13,500 ఎకరాలకు పైగా కొత్తగా సాగులోకి రాగా.. 2021–22 ఆర్థిక సంవత్సరంలో మరో 10వేల ఎకరాల్లో మల్బరీ సాగును విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందుకోసం రూ.51.920 కోట్ల అంచనాతో కార్యాచరణ సిద్ధం చేశారు. ‘సిల్క్‌ సమగ్ర’ పథకం కింద రూ.35.47 కోట్లు, స్టేట్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ (ఎస్‌డీఎస్‌) కింద రూ.12.29 కోట్లను ప్రతిపాదించారు. ఇప్పటికే ఎస్‌డీఎస్‌ కింద రూ.12.29 కోట్లు విడుదల చేయగా, కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.19.86 కోట్లు కేటాయింపులు జరిపారు. ఎకరా విస్తీర్ణంలో మల్బరీ మొక్కలు వేసుకునేందుకు రూ.10,500, షెడ్‌కు రూ.3 లక్షలు, పరికరాలకు రూ.57,500, మందుల కోసం రూ.3,750 చొప్పున రైతులకు అందిస్తారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న తెల్ల పట్టుగూళ్లకు కిలోకు రూ.50 చొప్పున ప్రభుత్వం ఇన్సెంటివ్‌ కూడా ఇస్తోంది.  

కొత్తగా మూడు ఆటోమేటిక్‌ రీలింగ్‌ యూనిట్లు 
గత ప్రభుత్వ హయాంలో తగిన ప్రోత్సాహం లేక నిస్తేజంగా తయారైన పట్టు పరిశ్రమకు ప్రస్తుత ప్రభుత్వం జవసత్వాలు కల్పిస్తోంది. వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలవడంతో మూలనపడ్డ మగ్గాలు సైతం మళ్లీ నేత నేస్తున్నాయి. ప్రభుత్వ చేయూతతో పెద్దఎత్తున పట్టు పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటవుతున్నాయి. ఇప్పటివరకు హిందూపురం, తాడిపత్రి, కుప్పం, శాంతిపురం, ధర్మవరంలలోనే పట్టు ఆధారిత పరిశ్రమలున్నాయి. గడచిన రెండేళ్లలో రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల పెట్టుబడులతో మదనపల్లి, పెద తిప్పసముద్రం, చేబ్రోలులో కొత్తగా ఆటోమేటిక్‌ రీలింగ్‌ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ధర్మవరంలో మరో పరిశ్రమ రాబోతుంది.  

రైతులు ముందుకు రావాలి 
పట్టు పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. మల్బరీ సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఒక్కసారి మొక్కలు వేస్తే కనీసం 20 ఏళ్ల పాటు ప్రతినెలా ఆదాయం వస్తుంది. తొలి ఏడాది 600 కేజీలు, రెండో ఏడాది 800 కేజీల చొప్పున పట్టుగూళ్ల దిగుబడి వస్తుంది. ఆ తర్వాత క్రమేపి వెయ్యి నుంచి 1,200 కేజీల వరకు పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో పట్టుగూళ్లకు మంచి రేటు పలుకుతోంది. సాగుకు ముందుకొచ్చే రైతులకు ప్రభుత్వం అన్నివిధాలుగా తోడ్పాటునిస్తుంది. 
– సి.అరుణకుమారి, అడిషనల్‌ డైరెక్టర్, సెరీకల్చర్‌

మరిన్ని వార్తలు