పెండింగ్‌లో ఉన్న డీఏల చెల్లింపు..

24 Oct, 2020 18:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏ(కరువు భత్యం)ల చెల్లింపులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో డీఏల చెల్లింపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది. దాని ప్రకారం జూలై 2018 నాటి మొదటి డీఏను 2021 జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. మొదటి డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 1035 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఇక జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జూలై జీతాల్లో చెల్లించాలని ఆదేశించగా.. దీని ద్వారా 2074 కోట్ల అదనపు భారం పడనుంది. (చదవండి: కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు నిలిపివేత)

జూలై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని ఆదేశించారు. ఇక మూడో డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 3802 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. మొదటి డీఏ బకాయిలను జీపీఎఫ్‌లో 3 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో జమ చేయాలని ఆదేశించారు. సీఎం జగన్ నిర్ణయంతో 4.49 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

సీఎం జగన్‌ ఉ‌ద్యోగుల పక్షపాతి: వెంకట్రామిరెడ్డి
ప్రభుత్వం డీఏల చెల్లింపుకు ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. వాయిదా పడ్డ జీతాలను కూడా నవంబర్‌ 1 నుంచి చెల్లించనున్నారు అని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్‌ ఉద్యోగుల పక్షపాతి అని ప్రశంసించారు.

రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న సరే సీఎం జగన్ఉ‌ ద్యోగులకు మేలు చేయడం ఆనందంగా ఉంది అన్నారు రెవిన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. వాయిదా పడ్డ జీతాలను, పెండింగ్ డీఏలను చెల్లించేందుకు అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సీఎం జగన్‌ ఉద్యోగులకు మేలు చేశారన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం సంతోషం అన్నారు.

మరిన్ని వార్తలు