AP: ఇక ‘పవర్‌’ పోలీస్‌స్టేషన్లు

28 Nov, 2021 11:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ సంస్కరణల అమలులో భాగంగా మరో విప్లవాత్మక మార్పు రానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘పంపిణీరంగ పునరుద్ధరణ పథకం, సంస్కరణల ఆధారిత, ఫలితాలతో అనుసంధానించిన పథకం (రీవాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్, ఏ రిఫార్మ్‌ బేస్డ్‌ అండ్‌ రిజల్ట్‌ లింక్డ్‌ స్కీమ్‌)’ ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరెంటు పోలీసులు రానున్నారు. ఈ మేరకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. విద్యుత్‌ పంపిణీని పూర్తిగా ప్రైవేటీకరించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని రూపొందించింది.

దీనిలో భాగంగా అన్ని నగరాలు, పట్టణాల్లోని మొత్తం పంపిణీ వ్యవస్థను ప్రైవేటు సంస్థలకు, ఫ్రాంచైజీలకు అప్పగిస్తారు. ఇళ్లకు ప్రీపెయిడ్‌ మీటర్లను బిగిస్తారు. ఇప్పటిలా ఇంటింటికి తిరిగి విద్యుత్‌ వినియోగాన్ని నమోదు చేసి బిల్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. సెల్‌ఫోన్ల రీచార్జ్‌లా మీటర్‌ రీచార్జ్‌ చేయించుకుంటేనే కరెంట్‌ సరఫరా జరుగుతుంది. ఈ మొత్తం పథకం అమలుకు దేశవ్యాప్తంగా 2021–22 నుంచి 2025–26 వరకు రూ.3,03,758 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దీనిలో రూ.97,631 కోట్లను కేంద్రం బడ్జెట్‌ ద్వారా రాష్ట్రాలకు సమకూర్చనుంది. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డిస్కమ్‌లు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. దీనికోసం తప్పనిసరిగా చేపట్టాల్సిన చర్యల్లో విద్యుత్‌ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు ఒకటి. వీటిని ఏర్పాటు చేస్తేనే కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. దీంతో తప్పనిసరిగా 2003 నాటి విద్యుత్‌ చట్టం ఆధారంగా పవర్‌ పోలీస్‌లు రానున్నారు.

పర్యవేక్షణకు  ప్రత్యేక ఏర్పాటు
పథకం అమలుకు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నాక వివిధ మంత్రిత్వ శాఖలతో పర్యవేక్షణ కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తుంది. దీనికి కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి చైర్మన్‌గా ఉంటారు. రాష్ట్రాలు పంపే అన్ని సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌)లను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఇదికాకుండా మరో నోడల్‌ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసి సలహాదారులను నియమిస్తుంది. వీరు రాష్ట్రాలు, ప్రాంతాలవారీగా అవసరమైన పథకాలను రూపొందించి కేంద్రానికి నివేదిస్తారు. విద్యుత్‌ శాఖలో ప్రస్తుతం విజిలెన్స్‌ విభాగం ఉంది. విజయవాడలోని ఏపీ ట్రాన్స్‌కో ప్రధాన కార్యాలయంలో ఐపీఎస్‌ స్థాయి అధికారి జాయింట్‌ ఎండీగా ఉన్నారు.

రాష్ట్రంలో మూడు డిస్కమ్‌లపై ఫిర్యాదులపై విజిలెన్స్‌ స్పందిస్తుంటుంది. తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థకు విశాఖలో, మధ్యప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థకు విజయవాడలో, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థకు తిరుపతిలో విజిలెన్స్‌ విభాగాలున్నాయి. చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు ఉన్నారు. ప్రస్తుతం వీరు డిస్కమ్‌లలో ఉద్యోగులపై వచ్చిన వివిధ రకాల ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నారు. వీరు కాకుండా ప్రతి సర్కిల్‌ కార్యాలయంలోనూ విద్యుత్‌ చౌర్య నిరోధక విభాగం (డీపీఈ) అధికారులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన పవర్‌ పోలీస్‌స్టేషన్లు వస్తే.. వాటి ద్వారా ఎటువంటి కార్యకలాపాలు నిర్వర్తించాలి? ఆ పోలీసుల విధి, విధానాలేమిటనే అంశాలపై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. విజిలెన్స్‌ వ్యవస్థను దానిలో అనుసంధానించి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తారా లేక విలీనం చేస్తారో తేలాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు