ఇక ఆన్‌లైన్‌లో డిగ్రీ అడ్మిషన్లు

16 Oct, 2020 23:40 IST|Sakshi

కమిటీ ద్వారా పారదర్శకంగా సీట్ల భర్తీ

అన్ని కాలేజీల్లో రిజర్వేషన్లు అమలు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కోర్సుల వారీగా నిబంధనలు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను ఇక ఆన్‌లైన్‌లో నిర్వహించేలా ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్ట్స్‌, సైన్స్‌, సోషల్‌ సైన్సెస్‌, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, సోషల్‌ వర్క్‌ తదితర అన్ని డిగ్రీ కోర్సులకు ఆన్‌లైన్‌లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ అటానమస్‌, ఎయిడెడ్‌, ప్రైవేట్‌, ప్రైవేట్‌ అటానమస్‌ కాలేజీల్లో సీట్లను ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ద్వారా పారదర్శకంగా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర గురువారం రాత్రి జీవో 34 విడుదల చేశారు. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియను ప్రత్యేక కమిటీ ద్వారా చేపట్టనున్నారు. అడ్మిషన్ల విధివిధానాలను ఉత్తర్వుల్లో పొందుపరిచారు.

బీఏ, బీకాం, బీకాం (ఒకేషనల్‌), బీకాం ఆనర్స్‌, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సులకు ఆన్‌లైన్‌ అడ్మిషన్లు చేపడతారు. 
బీఎస్సీలో ప్రవేశానికి ఇంటర్‌ సైన్సు సబ్జెక్టుల్లో 40 శాతం మార్కులు సాధించాలి.
ఇంజనీరింగ్‌, టెక్నాలజీ, నాన్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో డిప్లొమో పాసైన అభ్యర్థులు డిగ్రీ సెకండ్‌ ఇయర్‌లో చేరేందుకు అర్హులు. వీరికోసం 5 శాతం సూపర్‌ న్యూమరరీ సీట్లు కేటాయిస్తారు.
మేథమెటిక్స్‌, ఎకనమిక్స్‌, కామర్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ చదివిన వారు బీఎస్సీ మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్సు కాంబినేషన్‌ కోర్సులో చేరేందుకు అర్హులు.
సీట్లను మెరిట్‌ ప్రాతిపదికన, రిజర్వేషన్లను పాటిస్తూ కేటాయిస్తారు.
బీకాంలో 60 శాతం సీట్లను ఆయా వర్సిటీల పరిధిలో కామర్స్‌  సబ్జెక్టుగా అర్హత పరీక్షను పూర్తిచేసిన వారికి కేటాయిస్తారు. బీఏలో 50 శాతం సీట్లను సోషల్‌ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌ సబ్జెక్టులుగా అర్హత పరీక్ష  పూర్తిచేసిన వారికి కేటాయిస్తారు.
డిగ్రీ కాలేజీల్లోని 85 శాతం సీట్లను స్థానిక కోటాగా, 15 శాతం సీట్లను అన్‌ రిజర్వుడ్‌ కోటాగా భర్తీ చేస్తారు. రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం సీట్లు కేటాయిస్తారు.
ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం సూపర్‌ న్యూమరరీ సీట్లు కేటాయిస్తారు.
స్పోర్ట్స్‌ కోటాలో 29 కేటగిరీల వారికి 0.5 శాతం సీట్లు కేటాయిస్తారు. ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌, ఎన్‌సీసీ సహా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన వారికి 1 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 2 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.
మహిళలకు మొత్తం సీట్లలో ఆయా కేటగిరీల్లో 33.1/3 శాతం సీట్లు కేటాయిస్తారు.

మరిన్ని వార్తలు