ఈసీ సెన్సూర్ ఆర్డర్‌ని తిప్పి పంపిన ప్రభుత్వం

27 Jan, 2021 18:23 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సెన్సూర్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తిప్పి పంపింది. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లపై ఎన్నికల కమిషనర్ సెన్సూర్ ఆర్డర్‌కు బుధవారం ఆదేశాలు జారీ చేయగా ఎస్‌ఈసీకి ఆ అధికారం లేదని ప్రభుత్వం తిప్పి పంపింది. అధికారుల వివరణ లేకుండా ప్రొసీడింగ్స్‌ను జారీ చేయలేరన్న ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారుల సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకునే అధికారం లేదని తెలిపింది. అసలు అధికారుల వివరణ కూడా పెనాల్టీ ఎలా సిఫార్సు చేస్తారని ప్రశ్నించింది. ఇద్దరు సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. చదవండి: ఆ ఇద్దరి బదిలీకి ఎస్‌ఈసీ ‘నో’

కాగా పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లను బదిలీ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ ‌కుమార్‌ అడ్డు చెప్పిన విషయం తెలిసిందే.  కీలకంగా వ్యవహరించాల్సిన ఈ ఇద్దరినీ ఎన్నికల ప్రక్రియ మధ్యలో బదిలీ చేయడంవల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఆయన మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ రాశారు. వారి బదిలీ ప్రతిపాదనను తిరస్కరించిన నిమ్మగడ్డ.. ఆ ఇద్దరిపై ‘సెన్సూర్‌’ పేరిట క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ మంగళవారం వేరుగా ఆదేశాలు జారీచేశారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారీలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విధి నిర్వహణలో వారు విఫలమైనట్లుగా వారి సర్వీసు రికార్డులో నమోదు చేయాలన్నారు. సెన్సూర్‌ కింద క్రమశిక్షణ చర్యలంటే ఒక ఏడాదిపాటు పదోన్నతులకు అవకాశం ఉండదని అర్ధం చేసుకోవాలని అధికార వర్గాలు చెప్పాయి.

మరిన్ని వార్తలు