ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

12 Nov, 2021 21:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యా సంస్థలకు పునరాలోచనకి అవకాశమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎయిడెడ్ విద్యాసంస్దల విలీనంపై నాలుగు ఆప్షన్లు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

► మొదటి ఆప్షన్‌గా ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులతో సహా ఎయిడెడ్ విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులని, స్టాఫ్ ని పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించడం

►రెండవ ఆప్షన్‌గా విద్యాసంస్థల ఆస్థులు కాకుండా కేవలం మంజూరు అయిన‌ ఉపాద్యాయ పోస్టులని, స్టాఫ్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తూ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగించడం

► మూడవ ఆప్షన్‌గా మొదటి రెండు ఆప్షన్‌లకు వ్యతిరేకంగా పూర్తిగా ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగించడం

► నాలుగవ ఆప్షన్‌గా మొదటి, రెండు ఆప్షన్‌లలో ఇప్పటికే ఎంచుకుని ప్రభుత్వానికి విలీనం చేయడానికి అంగీకరించిన విద్యాసంస్థలకి పునరాలోచన కల్పిస్తూ విలీనంపై అంగీకారానికి వెనక్కి తీసుకుని పూర్తిగా ఎయిడెడ్ విద్యాసంస్థగా నడుపుకోవడానికి అవకాశం ఇచ్చింది.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2249 ఎయిడెడ్ విద్యాసంస్థలలో 68.78% మొదటి రెండు ఆప్షన్‌లకు స్వచ్చందంగా అంగీకరించాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,600 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది. తాజాగా మరోసారి విలీనానికి అంగీకరించిన ఎయిడెడ్ విద్యా సంస్ధలు తమ అంగీకారాన్ని వెనక్కి తీసుకునే వెసులు బాటు కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు  జారీ అయ్యాయి.  వీలైనంత త్వరగా ఎయిడెడ్ విలీన ప్రక్రియ ముగించడానికి పాఠశాల విద్యా శాఖ, ఉన్నత విద్యా శాఖ, సాంకేతిక శాఖ, ఇంటర్ బోర్డులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

మరిన్ని వార్తలు