కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే నోటిఫై చేయండి

17 Apr, 2021 03:38 IST|Sakshi

తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చవద్దు

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిని తక్షణమే నోటిఫై చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చవద్దని స్పష్టం చేసింది. పరిధిని నోటిఫై చేయకపోతే కృష్ణా జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడంలోనూ.. నియంత్రించడంలోనూ బోర్డు సాధికారికంగా విధులు నిర్వర్తించలేదని పేర్కొంది.

ఈ మేరకు కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు శుక్రవారం లేఖ రాశారు. ‘బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేయాలని గతేడాది అక్టోబర్‌ 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్రాన్ని కోరారు. బోర్డు పరిధిని నోటిఫై చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెప్పారు. అనుమతులు లేకుండానే తెలంగాణ సర్కార్‌ అక్రమంగా 5 ప్రాజెక్టులు చేపట్టింది. 3 ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచింది. దీనిపై కృష్ణా బోర్డుకు, కేంద్ర జల్‌ శక్తి శాఖకు ఫిర్యాదు చేశాం. ఆ ప్రాజెక్టులను నిలిపివేయాలని తెలంగాణను కేంద్రం ఆదేశించింది. వాటి పనులు ఆపేలా చూడాలని కృష్ణా బోర్డును ఆదేశించింది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లతో కేంద్ర ఉన్నతాధికారుల సమావేశం 
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను నిర్ణయించడానికి కేంద్ర జల్‌ శక్తి శాఖ శుక్రవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. రెండు బోర్డుల చైర్మన్లు, కేంద్ర జల్‌ శక్తి శాఖ ఉన్నతాధికారులు వర్చువల్‌ విధానంలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. బోర్డుల పరిధి ఖరారుపై చర్చించారు. అయితే, ఈ సమావేశం వివరాలను ఉన్నతాధికారులు బయటకు వెల్లడించలేదు.    

మరిన్ని వార్తలు