టమాటా రైతుకు ఏపీ సర్కార్‌ బాసట 

12 Aug, 2022 08:24 IST|Sakshi

ధరలు నిలకడగా ఉండేలా చర్యలు 

ఆ మూడు జిల్లాల్లో కిలో ధర రూ.6 నుంచి రూ.20 

ఆర్బీకేల ద్వారా సుమారు 300 క్వింటాళ్లు కొని రైతుబజార్లకు తరలించిన ప్రభుత్వం 

చిత్తూరులోని ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా కొనుగోలుకు సన్నాహాలు

అధికారులతో సమీక్షించిన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ధర లేక సతమతమవుతున్న టమాటా రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. నాణ్యమైన టమాటానే కాదు.. కాస్త వినియోగానికి పనికొచ్చేలా ఉన్న టమాటాను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతుకు అండగా నిలవాలని సంకల్పించింది. మరోవైపు టమాటా ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్వాహకుల సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద మిగిలి ఉన్న టమాటా నిల్వలను కొనుగోలు చేయించేలా చర్యలు చేపట్టింది.
చదవండి: సీఎం వైఎస్‌ జగన్‌ చొరవ.. నెరవేరిన 25 ఏళ్ల కల

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ పి.ఎస్‌.ప్రద్యుమ్న, రైతుబజార్ల సీఈవో బి.శ్రీనివాసరావుతో పాటు అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. టమాటా రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలçహాలు ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు.

రైతులెవరైనా తమవద్ద టమాటా నిల్వలున్నాయి, కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటూ ఆర్బీకేకు సమాచారం ఇస్తే వెంటనే స్పందించి వారిని ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్వాలిటీ ఎలా ఉన్నా సరే వినియోగానికి పనికి వస్తాయని భావిస్తే కొనుగోలు చేయాలని ఆదేశించారు. అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల పరిధిలోని వివిధ మార్కెట్లకు 51,661 క్వింటాళ్ల టమాటా రాగా, ధర పతనం కాకుండా మార్కెటింగ్‌శాఖ దగ్గరుండి పర్యవేక్షించింది.

ఫలితంగా నాణ్యమైన టమాటాకు సైజును బట్టి కిలో రూ.12 నుంచి రూ.20 వరకు ధర లభించింది. మినిమమ్‌ క్వాలిటీ రకానికి కిలో రూ.6 నుంచి రూ.15 వరకు, మధ్యస్థ రకానికి కిలో రూ.10 నుంచి రూ.18 వరకు ధర లభించింది. మరోవైపు ఆయా జిల్లాల పరిధిలో తమ వద్ద నిల్వలున్నాయి, కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటూ రైతులు అందించిన సమాచారం మేరకు ఆర్బీకేల ద్వారా సుమారు 300 క్వింటాళ్ల టమాటాను కిలో రూ.11 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది.

ఈ టమాటాను గుంటూరు, విజయవాడ రైతుబజార్లకు తరలించింది. మరోవైపు అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో రైతుల వద్ద ఉన్న టమాటా నిల్వలను కొనుగోలు చేసేలా చిత్తూరు జిల్లాలో ఉన్న టమాటా ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్వాహకులతో సమావేశమై వారిని  ఒప్పించింది. ఇలా సుమారు 500 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఆందోళన వద్దు 
టమాటా రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. క్వాలిటీతో సంబంధం లేకుండా వినియోగానికి పనికి వచ్చే టమాటాను కొనుగోలు చేస్తాం. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు నిలకడగానే ఉన్నాయి. ఒకవేళ మీ వద్ద ఉన్న టమాటా నిల్వలను మార్కెట్‌లో అమ్ముకోలేని పక్షంలో ఆర్బీకేలకు సమాచారమివ్వండి. ప్రభుత్వం తప్పకుండా కొనుగోలు చేస్తుంది. 
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి  

మరిన్ని వార్తలు