ఆరోగ్యశ్రీలోకి ‘బ్లాక్‌ ఫంగస్‌’

20 May, 2021 03:55 IST|Sakshi

 రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ ఫంగస్‌ జబ్బు వస్తోంది. స్టెరాయిడ్స్‌ వాడిన తర్వాత షుగర్‌ లెవెల్స్‌ ఎక్కువగా పెరగడం తదితర కారణాల వల్ల ఫంగస్‌ ఎక్కువగా సోకుతుండటం, వైద్యం ఖరీదు కావడంతో రకరకాల వైద్య పరీక్షలతో పాటు చికిత్సలు, శస్త్రచికిత్సలను కూడా ఆరోగ్యశ్రీలోకి తెచ్చారు. సీటీ/ఎంఆర్‌ఐ, ఫంగల్‌ కల్చర్, కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్, రీనల్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ (కిడ్నీ), షుగర్‌ టెస్ట్‌లు, హెచ్‌బీఏ1సీ, నాజల్‌ ఎండోస్కొపీ వంటివన్నీ ఉచిత చికిత్సలో భాగంగా చేయాలి.

అంతేకాకుండా యాంటీబయాటిక్, ఐవీ ఫ్లూయిడ్స్, లింఫొసొమాల్‌ (యాంపొటెరిసిన్‌ బి) లేదా ఓరల్‌ పొసకొనొజోల్‌ ఇవ్వాలి. వైద్య పరీక్షల ఆధారంగా 2 వారాల నుంచి 3 వారాల పాటు ఈ వైద్యం చేయాల్సి ఉంటుంది. చికిత్స అనంతరం ఏదైనా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినా అదనంగా కూడా కేటాయిస్తామని ఉత్తర్వుల్లో చెప్పారు. సర్జికల్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ప్రొప్టొసిస్‌కు రూ. 50 వేలు, యాంటీబయోటిక్స్, మందుల ప్యాకేజీకి రూ. 41,968, ఆఫ్తాల్మాలజీ ఆర్బిటొటొమి చికిత్సకు రూ. 27,810, ఎండోస్కోపిక్‌ సైనస్‌ సర్జరీకి రూ. 16,932, ఎక్స్‌ంటరేషన్‌ ఆఫ్‌ ఆర్బిట్‌ చికిత్సకు రూ. 10,180 నిర్ణయించారు. లింఫొసొమాల్‌ (యాంఫొటెరిసిన్‌ బి), పొసకొనొజోల్‌ ఇంజక్షన్లకు ఎంఆర్‌పీ ధరలు చెల్లిస్తారు. ఆరోగ్యశ్రీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ చికిత్స ఉచితంగా చేయాలని స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు