బాబు అపహాస్యం.. జగనన్న‌ ఆపన్న హస్తం

22 Jan, 2021 15:16 IST|Sakshi

2018లో తీవ్రవాదుల దాడిలో జవాన్‌ గుణకరరావు వీరమరణం

జవాన్‌ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటిస్తూ చంద్రబాబు జీవో

ఆర్థిక కష్టాలంటూ ఆ నగదును ట్రెజరీ నుంచి వెనక్కి లాగేసుకున్న బాబు సర్కార్‌

ఆ పరిహారం వెంటనే చెల్లించాలంటూ తాజాగా జగన్‌ ప్రభుత్వం ఆదేశం

సాక్షి, అమరావతి: దేశ సరిహద్దులో తీవ్రవాదులతో పోరాడుతూ వీర మరణం పొందిన ఓ సైనికుడి త్యాగాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం అపహాస్యం చేసింది. అతని కుటుంబానికి ప్రకటించిన రూ.5 లక్షల పరిహారాన్ని సైతం చెల్లించకుండా.. జిల్లా ట్రెజరీ నుంచి వెనక్కి లాగేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రస్తుత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ ప్రభుత్వం ఆ సైనికుడి కుటుంబానికి అండగా నిలిచింది. పరిహారం మొత్తాన్ని వెంటనే చెల్లించాలంటూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ఎ.ఎస్‌.కవిటి గ్రామానికి చెందిన ఎస్‌.గుణకరరావు ఆర్మీలో పనిచేస్తూ.. దేశ సరిహద్దు అయిన జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వర్తించేవారు. కాగా 2018 ఏప్రిల్‌ 11న తీవ్రవాదులతో పోరాడుతూ ఆయన వీర మరణం పొందారు.(చదవండి: వింత వ్యాధిపై సీఎం జగన్‌ సమీక్ష)

దీంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.. ఆయన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. 2019 మార్చి 13న జీవో జారీ చేసింది. ఆ డబ్బులు శ్రీకాకుళం జిల్లా ట్రెజరీకి కూడా వచ్చాయి. అయితే.. ఆర్థిక కష్టాలున్నాయంటూ ఆ రూ.5 లక్షల పరిహారాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం ట్రెజరీ నుంచి రాష్ట్ర ఖజానాకు లాగేసుకుంది. ఈ విషయం తాజాగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ దృష్టికి రావడంతో.. ఆయన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి తెలియజేశారు. దీంతో గుణకరరావు భార్య జయమ్మకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన(రాజకీయ) శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు. 
 

మరిన్ని వార్తలు