చేపకు ఇక నాణ్యమైన ఫీడ్‌

6 Dec, 2020 20:17 IST|Sakshi

చేపల మేత తయారీలో అనైతిక విధానాలకు చెక్‌

నాణ్యత ప్రమాణాలకు భిన్నంగా మేత ఉంటే భారీ జరిమానాలు

ఈ మేరకు అసెంబ్లీలో ఫిష్‌ ఫీడ్‌ యాక్ట్‌-2020 బిల్లును ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం

విదేశీ మేతలో నాణ్యత ప్రమాణాలు లేకుంటే దిగుమతులు నిలిపివేత

సాగు వ్యయంలో 60 శాతం మేతకే ఖర్చు చేస్తున్న ఆక్వా రైతులు 

త్వరలో అమలులోకి రానున్న ఫిష్‌ ఫీడ్‌ యాక్ట్‌

దీనివల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు

సాక్షి, అమరావతి: చేపలు, రొయ్యల మేతలో ఇప్పటివరకు ఉన్న అనైతిక విధానాలకు ఫిష్‌ ఫీడ్‌ యాక్ట్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెక్‌ పెట్టబోతోంది. తద్వారా ఆక్వా రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేయనుంది. ఈ మేరకు తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఫిష్‌ ఫీడ్‌ యాక్ట్‌-2020 బిల్లును ఆమోదించింది. త్వరలోనే ఈ బిల్లు చట్ట రూపం దాల్చనుంది. చేపల మేత తయారీలో కొన్ని ముడి ప్రొటీన్‌ కలిగిన జీర్ణం కాని పదార్థాలు, యూసిడ్, కరగని బూడిద, యూరియా మొదలైన వాటిని ఉత్పత్తిదారులు కలపడం వల్ల ఆక్వా రైతులు నష్టపోతున్నారు. రొయ్యలు, చేపల పెంపకంలో 60 శాతం మేత కోసమే రైతులు ఖర్చు చేస్తున్నారు. నాణ్యత లేని మేత వల్ల ఆశించిన స్థాయిలో చేపలు, రొయ్యల పెరుగుదల ఉండటం లేదు. మరోవైపు వాటికి వ్యాధులు కూడా సంక్రమిస్తుండటంతో రైతులకు నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాణ్యమైన మేతను రైతులకు అందిస్తే చేపలు, రొయ్యల దిగుబడి అధికంగా ఉండటంతోపాటు మేత వ్యాపారం కూడా బాగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం సాలీనా మేత వ్యాపారం రూ.17 వేల కోట్ల వరకు ఉంటోంది. ఇంత టర్నోవర్‌ కలిగిన మేత తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తే అటు రైతులకు.. ఇటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. 

దేశంలోనే తొలిసారిగా..
ఇప్పటివరకు రాష్ట్రంతోపాటు దేశంలోనూ చేపల మేతలో నాణ్యతను నిర్ధారించే ప్రభుత్వ విభాగం అందుబాటులో లేదు. చేపల మేత తయారీ పరిశ్రమల్లో అనైతిక, చట్టవిరుద్ధమైన పద్ధతులను నివారించడానికి, చేపల మేతలో నాణ్యత నిర్ధారణ చర్యలను అమలు చేయడానికి.. రాష్ట్రంలో ఫిష్‌ ఫీడ్‌ యాక్ట్‌-2020ను తేవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు రాష్ట్రంలో మొదటిసారిగా ఆక్వా రైతుల ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని తెస్తోంది. 

ఫిష్‌ ఫీడ్‌ యాక్ట్‌లో అంశాలు..
ఫిష్‌ ఫీడ్‌ యాక్ట్‌లో 28 విభాగాలు ఉన్నాయి.
మత్స్య శాఖ కమిషనర్, సంబంధిత అధికారులు చేపల మేత నాణ్యతను పరిశీలించడంతోపాటు తయారీలో అనైతిక విధానాలను నియంత్రించొచ్చు.
చేపల మేత వ్యాపారాలకు లైసెన్సులు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్, జిల్లా మత్స్యశాఖ అధికారి లేదా కమిషనర్‌ ప్రతిపాదించిన ఏ అధికారి అయినా లైసెన్సింగ్‌ అథారిటీగా వ్యవహరిస్తారు.
ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ అధికారి లేదా కంట్రోలింగ్‌ అధికారి నియమించిన అధికారులు చేపల మేత నాణ్యతను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు.
రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్, చేపల మేత వ్యాపార కార్యకలాపాలు, నియంత్రణ తదితర అన్ని విషయాలపై కంట్రోలింగ్‌ అథారిటీకి సలహాలు ఇవ్వడానికి, చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ కమిటీ ఉంటుంది.
మేతలో నాణ్యత ప్రమాణాల పరిశీలనకు రిఫరల్‌ ఫీడ్‌ అనాలిసిస్‌ లేబొరేటరీ, జిల్లా స్థాయిలో ఫిష్‌ లేబొరేటరీలను ఏర్పాటు చేస్తారు.
రాష్ట్రంలో, ఇతర దేశాల్లో తయారు చేసిన చేపల మేతలో నాణ్యత ప్రమాణాలు ఒకేలా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విదేశీ మేతలో నాణ్యత లేకుంటే దిగుమతులు ఆపేస్తుంది.
ఫిష్‌ఫీడ్‌ ఇన్‌స్పెక్టర్‌, థర్డ్‌పార్టీ టెక్నికల్‌ ఏజెన్సీలు నిరంతరం చేపల మేతలో నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తారు. నాణ్యత లేకుంటే భారీ జరిమానాలు విధిస్తారు.
 
ఫిష్‌ ఫీడ్‌ యాక్ట్‌ వల్ల ఆక్వా రైతులకు కలిగే ప్రయోజనాలు..
చేపలు, రొయ్యల మేత తయారీలో ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. అన్ని రకాల మేతల వాణిజ్య కార్యకలాపాలు ఫిష్‌ ఫీడ్‌ యాక్ట్‌ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటం వల్ల రైతులకు మేలు జరుగుతుంది.
రైతులు వారి అవసరాలకనుగుణంగా మేతను ఎంచుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది.
నిషిద్ధ యాంటీబయోటిక్స్‌ లేని చేపల మేత వాడటం ద్వారా మంచి బ్రాండ్‌ ఇమేజ్‌తో నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను అందిస్తుంది.

రైతుల ఆదాయం పెరుగుతుంది
మేతపై ఇప్పటివరకు ఎటువంటి నియంత్రణ విభాగం లేకపోవడం వల్ల అనేక కంపెనీలు నాణ్యత లేని మేతను తయారు చేసి రైతుల్ని నిలువు దోపిడీ చేశాయి. ఫీడ్‌ యాక్టు అమలులోకి వస్తే రైతులకు సాగు వ్యయం తగ్గుతుంది. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు నాణ్యమైన చేపలు, రొయ్యలు ఎగుమతి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ మన రాష్ట్రం నుంచి ఎగుమతి అయిన రొయ్యలు, చేపలకు మంచి రేటు లభిస్తుంది. తద్వారా రైతుల ఆదాయం పెరగడమే కాకుండా ఆక్వా రంగంపై ఆధారపడిన ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. 
- కన్నబాబు, కమిషనర్‌, మత్స్య శాఖ 

రైతులకు రక్షణ కవచం
ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న ఫీడ్‌ యాక్ట్‌ రైతుకు రక్షణ కవచం లాంటిది. కంపెనీలు మేత తయారీలో ఏ ముడి పదార్థాలు వాడుతున్నాయో స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీంతో నాణ్యమైన మేత అందుబాటులోకి వస్తుంది. ఎప్పటికప్పుడు మేతను పరిశీలించే అధికారం మత్స్యశాఖకు ఉండటం వల్ల అనైతిక విధానాలు పూర్తిగా తగ్గిపోతాయి. విదేశాలకు ఆక్వా ఎగుమతులు పెరుగుతాయి.
- డాక్టర్‌ నగేశ్, ప్రెసిడెంట్‌, నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిషర్‌మెన్‌ - ఏపీ

మరిన్ని వార్తలు